అంగన్వాడి పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 23 :
జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లలు, మహిళల సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సి. డి. పి. ఓ. లు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టవలసిన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, లోపం ఉన్న పిల్లలను గుర్తించి సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, అవసరమైన మందులను అందిస్తూ సాధారణ స్థితికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని. సి డి పి ఓ లు, సూపర్ వైజర్ లు తమ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం సందర్శించి పిల్లల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 4 బాల్య వివాహాలపై సమాచారం అందగా 4 బాల్య వివాహాలను నిలుపుదల చేయడం జరిగిందని, మిస్సింగ్ / రన్ అవే లో 10 మంది పిల్లలకు కౌన్సిలింగ్ అందించి తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. పాఠశాలల నుండి డ్రాప్ అవుట్ అయిన పిల్లలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ అందించి తిరిగి పాఠశాలలకు వచ్చే విధంగా తల్లిదండ్రుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో గుర్తించబడిన 147 కేసులలో ఉన్న పిల్లల సంరక్షణకు హోం విజిట్ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బాల కార్మికుల వ్యవస్థను రూపుమాపేందుకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో జనవరి నుండి 15-18 సంవత్సరాల వయసు గల బాల కార్మికులను గుర్తించడం జరిగిందని తెలిపారు. పోక్సో కింద జనవరి నుండి 20 కేసులు గుర్తించడం జరిగిందని, గృహహింసకి సంబంధించి బాధితులకు, కారకులకు కౌన్సిలింగ్ అందించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అక్టోబర్-2023 నుండి ఇప్పటివరకు జిల్లాలో 308 అవగాహన శిబిరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఊబకాయం సమస్యకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను గమనించాలని, అంగన్వాడీ కేంద్రాలలో విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే నిబంధనలకు లోబడి సంబంధిత సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల హాజరు శాతాన్ని పెంచే విధంగా టీచర్లు కృషి చేయాలని తెలిపారు. సఖి కేంద్రం ద్వారా లైంగిక, గృహహింస బాధితులకు ఆశ్రయం కల్పించి కౌన్సిలింగ్ అందించడం ద్వారా వారి సంక్షేమంపై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking