ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పని చేసి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాల్రావులతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. భీమారం మండలం మద్దికల్ గ్రామానికి చెందిన అలం చంద్రమ్మ,తోశ్రం కొండమ్మ తమకు గ్రామ శివారులో ఉన్న భూమిలో గిరి వికాస్ పథకం కింద బోర్ వేశారని,విద్యుత్ కనెక్షన్,మోటార్ అమర్చాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తాండూర్ మండల కేంద్రానికి చెందిన మేడి రాజయ్య తాను గ్రామ శివారులో గల భూమిలో గత 50 సంవత్సరాల నుండి వ్యవసాయ సాగు చేసుకుంటూ జీవిస్తున్నానని, తనకు ఇట్టి భూమిని ధరణిలో నమోదు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. దండేపల్లి మండల కేంద్రానికి చెందిన అజ్మీర ఈశ్వర్ నాయక్ తనకు గ్రామ శివారులో భూమి ఉందని, ఇట్టి భూమిని కొందరు తప్పుడు కోర్టు డిక్రీలతో రెవెన్యూ కార్యాలయంలో తమ పేరిట పట్టా మార్చుకొని విక్రయించారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నెన్నెల మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన బి.శంకర్, బి. కార్తీక్ తమకు మైలారం గ్రామ శివారులో పట్టాభూమి ఉందని, ఆన్లైన్లో ఇట్టి భూమి లావునిపట్టాగా నమోదు చేయబడిందని, ఈ పొరపాటున సవరించి తనకు న్యాయం చేయాలని కోరుతూ వేరువేరుగా అర్జీలు సమర్పించారు. వేమనపల్లి మండలం జిల్లెడ గ్రామానికి చెందిన పోలెంపల్లి సత్తయ్య తాను ప్రభుత్వం అందిస్తున్న గృహజ్యోతి పథకానికి అర్హుడనని,తాను ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నానని, తనకు పథకం వర్తింపచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీనగర్ కు చెందిన జాడి శ్రీలత తన మామకు నస్పూర్ శివారులో భూమి ఉందని, ఇట్టి భూమి నందు ఏర్పాటు చేసిన నస్పూర్ పోలీస్ స్టేషన్కు సంబంధించి నష్టపరిహారం ఇప్పించడంతో పాటు మిగిలిన భూమికి తన మామ, భర్త మరణించినందున తన పేరిట పట్టా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండల కేంద్రానికి చెందిన తిరుమల తన భర్త నస్పూర్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందారని,ఇట్టి ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.