కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దందా..
పట్టించుకోని ఆహార తనిఖీ అధికారులు
జగిత్యాల ప్రతినిధి, మే 30(ప్రజా బలం) గుమ గుమ వాసనలతో నోరూరించేలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వండే ఎగ్ ఫ్రైడ్ రైసులో నాసి రకం కోడిగుడ్లతో తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి ప్రజలను ఆసుపత్రుల పాలు చేస్తున్న సంఘటనలు జగిత్యాల లో చోటుచేసుకొంటున్నాయి. జగిత్యాల పట్టణ పరిధిలో దాదాపు 50కి పైగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. వీటితోపాటు దాదాపు ప్రతి గ్రామ గ్రామాన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. వీటన్నిటితో మొదటగా ఎక్కువగా అమ్ముడుపోయే ఆహార పదార్థాలలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఇందులో కస్టమర్ అవసరాలకు తగ్గట్టుగా సింగిల్, ఫుల్ ప్లేట్ ల వంతున విక్రయిస్తారు. ఇలాంటి సెంటర్లలోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టంగా తినేవారు డబుల్ ఎగ్ పేరుతో ఆసక్తిగా తింటారు. ఇధి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులకు వరంగా మారింది. ఎక్కువగా అమ్ముడుపోయే ఈఎఫ్ఆర్ లో అధిక లాభాలను ఆశపడ్డ కొందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ప్రజల ఆరోగ్యాలను ఫణంగా పెడుతూ ఎగ్ విక్రయ కేంద్రాల్లో నుంచి పగిలిన, నిర్ణిత కోడిగుడ్డు గడువు ముగిసిన గుడ్లను అతితక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీలో వాడుతున్నట్లు తెలిసింది. కోడిగుడ్లను ఓల్ సేల్ గా విక్రయించే వ్యాపారుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా పగిలిన కోడిగుడ్లలో బ్యాక్టీరియా తయారై ఉంటున్నట్లు తెలియగా ఇదేది పట్టించుకోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఈ ఎఫ్ఆర్లలో ఈ గుడ్లను వాడుతున్నట్లు తెలిసింది. ఇలాంటి ఆహారాన్ని తిన్నవారికి జీర్ణక్రియ సమస్యలు, వాంతులు వంటివి సంభవిస్తున్నట్లు తెలిసింది. దాదాపుగా ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోను కోడిగుడ్లను ప్రజలకు కనిపించేలా ఉంచరనే వాదనలు వినిపిస్తుండగా తయారీకి వినియోగించే స్టవ్ కు కింది భాగంలోనే ఈ నాసిరకం కోడిగుడ్లను ఉంచి వినియోగదారుడు ఈ ఎఫ్ ఆర్ అడగగానే కిందనే గుడ్లను కొట్టి తయారీని మొదలు పెడతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ విభాగం, మునిసిపల్ ప్రాంతాల్లో శానిటేషన్ లోని ప్రజారోగ్య విభాగాలకు తోడు జిల్లా కేంద్రాల్లో ఆహార తనిఖీ విభాగాలు ఉన్నా నిత్యం ప్రజారోగ్యం ప్రమాదాల బారిన పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆహార కల్తీ నిరోధక శాఖకు ఎన్నో ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆహార కల్తీని నిరోధించడానికి ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించి అరేండ్లు గడుస్తున్నా నేటికి చట్టం కార్యరూపంలోకి రాక పోవడంతో అన్నిశాఖల అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగిపోతోందని వినియోగదారుల సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కల్తీ నూనెల ప్రభావంతో ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదాల బారిన పడుతుండగా ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోని నాసిరకం తయారీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.