ఏప్రిల్ 14 నుంచి గ్రామ గ్రామాన జన చైతన్య యాత్రలు
28 నుంచి సన్నాహాక సమావేశాలు
వివరాలను వెల్లడించిన పోటు ప్రసాద్
ఖమ్మం ప్రతినిధి మార్చి 20 (ప్రజాబలం) ఖమ్మం ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు గ్రామ గ్రామాన సిపిఐ జన చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ నేడొక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు తెచ్చే చర్యలకు పాల్పడుతుందని పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టేవిధంగా అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 నుంచి గ్రామ గ్రామానికి సిపిఐ పేరుతో మోటార్ సైకిల్ యాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు ఖమ్మంలో జరిగిన సిపిఐ సమావేశాల నిర్ణయాలను సోమవారం జరిగిన సమావేశంలో ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 14న సత్తుపల్లిలో మోటార్ సైకిల్ జాతా ప్రారంభమవుతుందని అంబేడ్కర్కు నివాళులర్పించిన తర్వాత సభ జరుగుతుందని సభ అనంతరం సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరులో తొలిరోజు జాతా జరుగుతుందని ప్రసాద్ తెలిపారు.
ఖమ్మంజిల్లాలోని 21 మండలాల్లో గ్రామ గ్రామాన జన చైతన్య యాత్రలు నిర్వహిస్తామన్నారు. సత్తుపల్లిలో ప్రారంభమైన యాత్ర ఏప్రిల్ 21న ఖమ్మంలో ముగుస్తుందన్నారు. ప్రజలను సమీకరించేందుకు ఈ నెల 25 నుంచి నియోజక వర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. 25న పాలేరు, సత్తుపల్లి నియోజక వర్గ స్థాయి సమావేశాలు జరుగుతాయన్నారు. 26న వైరా నియోజక వర్గ సమావేశం, 27న మధిర నియోజక వర్గ సమావేశం, 28న ఖమ్మం నియోజక వర్గ సమావేశం జరుగుతుందన్నారు. తెలంగాణలో పాగా వేసేందుకు బిజెపి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతుందన్నారు. దేశంలో రెండుసార్లు అధికారం చేపట్టిన బిజెపి ప్రజలను బతకలేని స్థితికి నెట్టివేసిందని, దేశ సంపదను ఒకరిద్దరికి కట్టబెట్టి ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం తెచ్చిపెట్టిన బిజెపి రాష్ట్రంలో ఏదో సాధిస్తామని ప్రగాల్భాలు పలుకుతున్నారని ప్రసాద్ తెలిపారు. వీటన్నింటిని ప్రజలకు వివరిస్తూ యాత్రలు నిర్వహించనున్నట్లు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, సిద్దినేని కర్ణకుమార్, తాటి వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, జాగర్లమూడి రంజితక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.