ప్రజల అర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం

ఖమ్మం ప్రతినిధి మార్చి 20 (ప్రజాబలం) ఖమ్మం ప్రజల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. ‘‘గ్రీవెన్స్‌ డే’’ సందర్భంగా జిల్లా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయల భవన సముదాయ సమావేశ మందిరంలో అర్జీలను కలెక్టర్‌ స్వీకరించారు. భూసమస్యలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఆసరా, వికలాంగ పెన్షన్ల మంజూరు తదితర సమస్యలపై అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలన చేసి సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.
కామేపల్లి మండలం కొత్త లింగాలకు చెందిన పర్సా ఈశ్వరమ్మ తాను 5 సంవత్సరాలుగా బోదకాలు వ్యాధితో బాధపడుతున్నాని ఏ పనిచేయాలేకపోవడంతో ఇళ్లు గడవడం కష్టంగా ఉందని తనకు బోదకాలు బాదితులకు అందించే ఆసరా పింఛను ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును, వైరా మున్సిపాలిటీ 20 వ వార్డు కొణిజర్ల మండలానికి చెందిన కొర్రా వెంకన్న తనకు సంవత్సరం క్రితం పక్షవాతం రావడం జరిగినదని కాళ్లు, చేతులు చచ్చుపడటం వల్లన ఏ పనిచేయలేని పరిస్థితితో కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉన్నదని తనకు వికలాంగుల పించను మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాల్సిండి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి కలెక్టర్‌ సూచించారు. తల్లాడ మండలం కలకొడిమ గ్రామంకు చెందిన రైతు కొత్త పల్లి కృష్ణారావు తనకు కలకొడిమలో సర్వేనెం.228/అ/1 నందు 38 కుంటల భూమి కలదని దానిని కుటుంబ అవసరాల నిమిత్తం విక్రయించడం జరిగినదని రిజిస్ట్రేషన్‌ చేయుటకు వెళ్ళగా భూమి అన్‌లైన్‌లో ఆసైన్డ్‌ ల్యాండ్‌గా చూపిస్తున్నదని, దానిని సరిచేయించి క్లియరెన్స్‌ ఇవ్వగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం ఒ.ఎస్‌.డి ధరణికి సూచించారు. సత్తుపల్లి మండలం జగన్నాదపురం ఆర్‌.అండ్‌.ఆర్‌ ప్యాకేజి కమిటీ సభ్యులు కిష్టారం ఓ.సి కొరకు సత్తుపల్లి మండలం, గిరిజన నిర్వాసిత గ్రామమైన జగన్నాదపురంలో భూములు, ఇండ్లు, ఇండ్ల స్థలములు సేకరించినందున నిర్వాసితులకు కేటాయించిన ఆర్‌.అండ్‌.ఆర్‌ సెంటర్‌ నందు అవసరమైన నిర్మాణాలు పూర్తి చేయించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం కల్లూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారికి కలెక్టర్‌ సూచించారు. ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంకు చెందిన కొమ్మినేని నాగేశ్వరరావు తనకు భీమవరం గ్రామ కంఠంలో4`26ఏ అనే నెంబర్‌ ఇల్లు కల్గియున్నానని, దానికి రోడ్డు విస్తరణలో స్థలం, ప్రహరీ గోడను కోల్పోవడం జరిగినదని, దానితో పాటు ఇంటి వద్ద 41 అడుగుల కల్వర్టు నిర్మాణం చేపట్టడం జరుగుతున్నదని దానివల్ల తనకు చాలా అసౌకర్యం కలుగుచున్నదని అట్టి కల్వర్టును 31 అడుగులకు సవరించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్‌.అండ్‌.బి శాఖ అధికారికి సూచించారు.
ఈ సందర్భంగా ఖమ్మం నగరం గట్టయ్య సెంటర్‌కు చెందిన వికలాంగురాలు కూరపాటి రాంబాయి గత సోమవారం గ్రీవెన్స్‌లో తనకు ట్రైసైకిల్‌ మంజూరు చేయించగలరని సమర్పించిన దరఖాస్తుతో వెంటనే ట్రైసైకిల్‌ మంజూరు చేయడం పట్ల జిల్లా కలెక్టర్‌కు బొకె అందించి కృతజ్ఞతలు తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జిల్లా స్థాయి అధికారులు తదితరులు గ్రీవెన్స్‌ డేలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking