త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి,
విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు,
ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 26: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై సోమవారం సాయంత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్టుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో కలిసి చేరుకొన్నారు. రాష్ట్రానికి మొట్టమొదటిసారి వచ్చిన రాష్ట్రపతికి త్రివిధ దళాల వారు గౌరవ వందనం చేయగా ప్రత్యేక వాహనంలో ఆమె గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో కలిసి దిగగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభావేదికపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుతో కూర్చొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి రాష్ట్రపతిని శాలువాలతో సత్కరించి.. పుష్పగుచ్చాలను అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా కలెక్టర్ హరీశ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెర్ రవీంద్ర అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెర్ రవీంద్ర ,డీసీపీ సందీప్ ,రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ , సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.