ఒత్తిడి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణం పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయనీ పిన్సిపాల్ లలిత కుమారి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14 : సుశిక్షితులు,అనుభవజ్ఞులైన గురువులు సూచించిన మార్గాన్ని క్రమశిక్షణతో అనుసరించినట్లయితే, విద్యార్థినులు భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించగలరనీ, విద్యార్థినులు పరీక్షలంటే భయాన్ని వీడాలనీ,ఒత్తిడి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయనీ “ప్రముఖ ఉపన్యాసకులు, సైకాలజిస్ట్, మోటివేటర్ ప్రకాష్ బాణావత్ (మణి ప్రకాష్ మైండ్ కేర్ సెంటర్) సూచించారు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో బుధవారం రోజు ప్రిన్సిపాల్ లలిత కుమారి ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే, పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ప్రేరణాత్మక – అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ బాణావత్ ప్రకాష్ విద్యార్థినులతో మాట్లాడుతూ…”ఫలానా వారి పిల్లలు అని కాకుండా, ఫలానా వారి తల్లిదండ్రులు అని మీ గురించి తల్లిదండ్రులు సమాజము చెప్పుకునేలా, మెచ్చుకునేలా ఎదగాలని,” ఈ సందర్భంగా విద్యార్థినులకు ప్రేరణ కలిగించారు.ప్రణాళిక ప్రకారం,సమయాన్ని వృథా చేయకుండా,ఎలా చదవాలో తగిన మెలకువలను సూచించారు.పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలని, క్రమశిక్షణ వల్ల జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చని విద్యార్థినులకు తెలిపారు. ఉదయమే నిద్ర లేవడం,టైం మేనేజ్మెంట్, తేలికపాటి ఆహారం తీసుకోవడం,మెడిటేషన్, యోగ అలవాటు చేసుకోవడం,పరీక్ష హాలుకు అరగంట ముందే చేరుకోవడం వంటివి విద్యార్థినుల యొక్క ఉత్తమ లక్షణాలుగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా,కళాశాల ప్రిన్సిపల్ లలిత కుమారి మాట్లాడుతూ… పరీక్షలు వ్రాయబోయే సమయంలో ఇట్టి చక్కటి మోటివేషన్ తమ పిల్లలకు ఎంతగానో మేలు కలిగిస్తుందని,ఈ మోటివేషన్ క్లాస్ కోసం,తమ విలువైన సమయాన్ని గురుకుల విద్యార్థుల కోసం వెచ్చించిన ప్రముఖ సైకాలజిస్ట్ బాణావత్ ప్రకాష్ గొప్పగా అభినందించారు.
రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ మోటివేషన్ కార్యక్రమము ఆసాంతం విద్యార్థినులు అందరూ చాలా ఆసక్తిగా పాల్గొన్నారు.ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పొందారు.ఈ అవగాహన – ప్రేరణ సదస్సులో,జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ ,జీ.మౌనిక,సీనియర్ జే ఎల్ ఎస్.రమాదేవి,పదవ తరగతి మరియు ఇంటర్ బోధించే ఉపాధ్యాయులు,విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
