ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 10 (ప్రజాబలం) ఖమ్మం త్రాగునీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుండి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వేసవిలో త్రాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనపై, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నూతన జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, వేసవికాలం పూర్తి చేసుకోని వర్షాలు వచ్చేవరకు త్రాగునీటి సరఫరా అంశంపై అప్రమత్తంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో త్రాగునీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారువార్తా పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళిక, నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలు, నీటి పునరుద్ధరణ వివరాలు తెలియజేయాలని అన్నారు. త్రాగునీటి సంబంధించి ప్రజలు ఎక్కడ ఆందోళనలు చేయాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలని సీఎస్ తెలిపారు. వేసవి కాలంలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్దంగా ఉన్నామని, ఇటీవల సామాజిక మాధ్యమాల్లో, వార్తా పత్రికలలో త్రాగునీటి సరఫరా ఇబ్బందుల గురించి వచ్చిన అంశాలను, వాటికి గల కారణాలు, ఆ సమస్యలను పరిష్కరించిన తీరు వివరాలను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి జిల్లాలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, క్షేత్ర స్థాయిలో వచ్చే ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని, తాగునీటి సరఫరాకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి రెగ్యులర్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని అన్నారు. పట్టణాలలో ఏర్పడిన నూతన కాలనీలు, టెయిల్ ఎండ్ ప్రాంతాలకు త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, పట్టణాలలో, గ్రామాలలో త్రాగునీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సప్లిమెంట్ చేయాలని సిఎస్ పేర్కొన్నారు. రానున్న రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో త్రాగునీటి సరఫరా లో ఉత్పన్నమయ్యే సమస్యలను వెంటనే గుర్తించి, వాటిని సత్వరం పరిష్కరించే విధంగా చూడాలని, త్రాగునీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షించాలని సీఎస్ పేర్కొన్నారు. వానాకాలం 2023-24 కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన సమయానికి రైస్ డెలివరీ చేసే విధంగా ప్రతి జిల్లాలో రైస్ మిల్లుల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, ప్రతిరోజు రైస్ మిల్లులు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచేలా చూడాలని, సిఎంఆర్ రా రైస్ డెలివరీ పై కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు అంశాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర పై పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం జరుగుతుందని, ధాన్యం కొనుగోలు అంశంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే త్వరితగతిన సంబంధిత రైతుకు చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు కనీస మౌళిక సదుపాయాల కల్పన పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. త్రాగునీటి సౌకర్యం, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకుని రావడం, అదనపు టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల మైనర్ మేజర్ మరమ్మత్తులు, తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం కల్పన వంటి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలలో మౌళిక వస్తువుల కల్పనకు ప్రతి మండలంలో పనుల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ నియమించాలని, పాఠశాలలో మౌళిక వసతుల కల్పన కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి పాఠశాలలో అవసరమైన పనులు పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే ముందే పూర్తి చేయాలని సీఎస్ సూచించారు.
వడదెబ్బ తగిలిన వారికి అవసరమైన ప్రథమ చికిత్స సత్వరమే అందేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని, ఉపాధి హామీ పనులను ఉదయం పూట నిర్వహించాలని, ఉపాధి హామీ పనుల నిర్వహణ సమయంలో కార్మికులకు అవసరమైన మీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని అన్నారు. వడ గాల్పులు వీస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని, బయటకు వస్తే అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, వడ గాల్పులు గురైన వ్యక్తులకు వెంటనే అవసరమైన ప్రధమ చికిత్స చేసి సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని అన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, మిషన్ భగీరథ సిఇ శ్రీనివాస్, ట్రాన్స్ కో ఎస్ఇ సురేందర్, డిఆర్డిఓ సన్యాసయ్య, జడ్పి సిఇఓ వినోద్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. మాలతీ, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, సిపిఓ శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి మురిళీధర్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, సివిల్ సప్లయ్స్ డి ఎమ్ శ్రీలత, డిఇఓ సోమశేఖరశర్మ, ఇరిగేషన్, మిషన్ భగీరథ, మున్సిపల్ ఇఇలు మంగళంపూడి వెంకటేశ్వర్లు, పుష్పలత, కృష్ణ లాల్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.