* సరైన సమయానికి ఆస్పత్రులకు వెళ్లడం కీలకం
* ప్రపంచ కిడ్నీడే సందర్భంగా అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలో హెల్త్ టాక్
ప్రజాబలం ప్రతినిధి మార్చి 9: గతంలో కొవిడ్ సమయంలో వివిధ కారణాల వల్ల ఎక్కువమంది ఆస్పత్రులకు వెళ్లలేకపోయారు. అప్పట్లో ఆస్పత్రికి వెళ్తే కొవిడ్ సోకుతుందన్న భయాందోళనలకు తోడు, ఆస్పత్రుల ఖర్చులు కూడా కాస్త ఎక్కువగా ఉండటంతో వెనుకాడారు. అలాంటివారిలో చాలామంది మూత్రపిండాల రోగులు ఉన్నారని, వారందరికీ ఇప్పుడు దీర్ఘకాల చికిత్సలు అందించాల్సి వస్తోందని నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో గురువారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మూత్రపిండాల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక టాక్ షో నిర్వహించారు. అందులో వైద్యులు మాట్లాడుతూ, ‘‘అందరికీ మూత్రపిండాల ఆరోగ్యం – ఊహించనివాటికీ సిద్ధపడటం, నిస్సహాయులకు మద్దతు అనేది ఈసారి ప్రపంచ కిడ్నీ డే థీమ్. గతంలో వివిధ కారణాల వల్ల ఆస్పత్రులకు వెళ్లలేక, మూత్రపిండాల వ్యాధులు తీవ్రస్థాయిలో ఉన్నవారికి, చికిత్స ఖర్చులను భరించలేనివారికి కూడా సులభంగా అందుబాటులో మూత్రపిండాల చికిత్సలు అందించాలని నిర్ణయించాం. మూత్రపిండాల వ్యాధులు రావడానికి ప్రధాన కారణం మధుమేహం, రక్తపోటు, అధిక బరువు. ఈ మూడింటినీ నియంత్రణలో ఉంచుకుంటే చాలావరకూ ఈ వ్యాధులు దరిచేరవు. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ తినడం మానేసి, తగిన ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. 40 ఏళ్లు దాటినవారు క్రమం తప్పకుండా ప్రతియేటా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్ సమయంలో మూత్రపిండాల సమస్యలు వచ్చినా చాలామంది గుర్తించలేకపోయారు. ఆస్పత్రులకు వెళ్లకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడంతో అవి బయటపడలేదు. అలాంటివాళ్లు ఇప్పటికీ ఇంకా చికిత్సలు పొందాల్సి వస్తోంది.
అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలో డయాలసిస్, అడ్వాన్స్‌డ్ డయాలసిస్, మూత్రపిండాల మార్పిడి, జీవన్‌దాన్ ద్వారా మూత్రపిండాల సేకరణ.. ఇలాంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. పిల్లలకు మూత్రపిండాల వ్యాదులను ప్రత్యేకంగా చూసే సదుపాయం ఉంది’’ అని వైద్యులు వివరించారు. ఈ టాక్‌షోలో పాల్గొన్నవారిలో అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి చెందిన సీనియర్ నెఫ్రాలజిస్టు, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ శశిధర్, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ రాజేంద్ర, యూరాలజిస్టులు డాక్టర్ వేణు, డాక్టర్ నవీన్, సీవోవో డాక్టర్ సత్వీందర్ సింగ్ సభర్వాల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ రోగులకు ఉచితంగా ఓపీడీ సేవలతో పాటు కొన్నిరకాల కిడ్నీ పరీక్షలు, ఫైబ్రోస్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. అవి కాక ఇంకా ఏవైనా పరీక్షలు సూచిస్తే వాటన్నింటిపై 20% రాయితీ అందిస్తారు. ఇవన్నీ ప్రపంచ కిడ్నీ డే అయిన గురువారం మాత్రమే అమలవుతాయి.