మనమంతా ఒక్కటవుదాం, ఉగ్రవాదాన్ని తరిమికొడతాం.
వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ అమానుష దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ దారుణ ఘటనను నిరసిస్తూ వేములవాడ పట్టణంలోని అన్ని మసీదులలో ముస్లింలు శుక్రవారం రోజున నల్ల బ్యాడ్జీలు ధరించి ” ఉగ్రవాదం నశించాలి ” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్రతను భగ్నం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదన్నారు. ఒకవైపు మన సైనిక బలగాలు దేశ రక్షణ కోసం నిత్యం అపార త్యాగాలు చేస్తుంటే, అశాంతి కలిగించడమే లక్ష్యంగా ఉగ్రవాదులు అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా కుల, మతాలకతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటై, జాతీయ ఐక్యతను ప్రతిబింబించాలన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి మరింత కఠినమైన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న అరాచకులపై కేంద్రం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణంలోని ముస్లిం మత పెద్దలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.