నిజాయితీ నిరూపించుకో బీజేపీలో చేరిపో.

బోగ శ్రావణికి కౌన్సిలర్ రాము సవాల్

జగిత్యాల, ఫిబ్రవరి 12: జగిత్యాల మునిసిపల్ తాజా మాజీ చైర్మన్ బోగ శ్రావణి బీజేపీలో చేరేందుకు పావులు కడుపుతున్నారని దీనికి ముందే తన నిజాయితీని నిరూపించుకోవాలని అప్పుడే స్వాగతిస్తామని 24 వ వార్డు కౌన్సిలర్ గుర్రం (రాము) రమేష్ సవాల్ విసిరారు. ఆదివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. గత మూడేళ్ళుగా మునిసిపల్ చైర్ పర్సన్ గా కొనసాగిన శ్రావణి ఏనాడు పట్టణ సమస్యలను పట్టించుకోకుండా తన స్వలాభం కోసం పనిచేశారన్నారు. పట్టణంలో హరితహారంలో నాటిన మొక్కల వివరాలు అడిగితే జవాబులేదని లెక్కలు, మొక్కల వివరాలు చెప్పలేదన్నారు. నా స్వంత వార్డు 24 లో 4 వేల మొక్కలను నాటినట్లు బిల్లు ఎత్తారని రాము పేర్కొన్నారు. ట్రీ పార్కులు, నర్సరీల పేరిట కోట్లాది బిల్లులు ఎత్తి వాటిని గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా 4 లక్షల లెక్కన డీజిల్ పై మామూళ్లు తీసుకొని అపవాదును కౌన్సిల్ పై, సంబంధిత సెక్షన్ అధికారిపై నెట్టారన్నారు. డీజిల్ కుంభకోణాన్ని బయటకు తీసి మహిళా కమిషనర్ ను బదిలీ చేయించిన సంఘటన అందరికి తెలుసన్నారు. జగిత్యాల మునిసిపల్ చరిత్రలోనే మాయనిమచ్చ రెండుసార్లు ఏ. సి.బి.దాడులు శ్రావణి హయాంలోనే కాదా అని రాము ప్రశ్నించారు. తన కుటుంబ స్వలాభం కోసం పనిచేసిన శ్రావణి అవినీతి వ్యవహారాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసి ధర్నాలు చేసిన సంఘటన లున్నాయన్నారు. జాతీయ శక్తిగా ఎదిగిన బిజెపి పార్టీ మాములు పార్టీకాదని ఇందులో బోగ శ్రావణి చేరాలంటే తనపై వచ్చిన అవినీతి అక్రమాలన్నీ నిజం కాదని నిరూపించుకొని నిజాయితీగా వస్తే బీజేపీలోకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తామని 24 వ వార్డు కౌన్సిలర్ గుర్రం (రాము) రమేష్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking