రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 20 : భారీ వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు రక్షణ చర్యలపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,జి.హెచ్.ఎం.సి. కమీషనర్ ఆమ్రాపాలి ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లు,జిల్లా అధికారులతో భారీ వర్షాలు,నూతన ఆర్.ఓ.ఆర్.చట్టం, ఎల్.ఆర్.ఎస్.ధరణి దరఖాస్తుల వరిశీలన అంశాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ,సమాచార శాఖ మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదు అయ్యే ప్రాంతాలలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలని,ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు. తీసుకోవాలని తెలిపారు. వర్షపాతం జోన్లలో అత్యవసరాల మేరకు రక్షణ చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ మళ్ళించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.వర్షాలకు సంబంధించి ప్రాంతాల పరిస్థితి ఆధారంగా రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ ఉంటుందని, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టాలని, మురుగు కాలువలలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, అంతర్గత రహదారుల శుభ్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత జిల్లాలలో ఏదైనా సమస్య ఉండి జిల్లా స్థాయిలో పరిష్కారం కానట్లయితే రాష్ట్ర స్థాయి కమిటీని సంప్రదించాలని తెలిపారు.రికార్డుల హక్కులు(ఆర్.ఓ.ఆర్.) నూతన చట్టం క్రింద ధరణిలో వచ్చే చట్టం వివరణలు ప్రజలకు తెలియజేయాలని, ఈ నెల 23,24 తేదీలలో జిల్లా స్థాయిలో నూతన చట్టం గురించి వర్క్షాప్ నిర్వహించాలని,నూతన చట్టం గురించి ప్రజలు, మేధావులు,నిపుణలకు వివరించి వారి నుండి సలహాలు,సూచనలు స్వీకరించాలని,వాటిని రాష్ట్ర స్థాయి కమిటీకి పంపించాలని తెలిపారు. ఎల్.ఆర్.ఎస్. -2020 పథకంలో రాష్ట్రంలో వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రమబద్దీకరించాలని, దరఖాస్తుదారుల నుండి స్వీకరించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ నిర్వహణ కొరకు జిల్లా స్థాయి,గ్రామ పంచాయతీ స్థాయి అధికారులు,మున్సిపల్ కమీషనర్లతో బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించాలని, దరఖాస్తులు తిరస్కరించబడినట్లయితే సదరు కారణాన్ని రిమార్కు కాలములో స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు.ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ కొరకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, గ్రామపంచాయతీ స్థాయిలో జిల్లా పంచాయతీ అధికారి చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లు గ్రామ పంచాయతీ,జిల్లా స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు, ధరణి పోర్టల్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ…వర్షాల నేపథ్యంలో జన జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు,నివాస గృహాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నూతన ఆర్.ఓ.ఆర్. రెవెన్యూ చట్టంపై రైతులు, మేధావులు,నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించి పూర్తి వివరాలతో రాష్ట్ర కమిటీకి నివేదిక అందిస్తామని తెలిపారు. ధరణి పోర్టల్లో నమోదైన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.