ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 18 : సమాజంలో చదువుతోనే మనకు మంచి గుర్తింపు వస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పాఠశాల తరగతి గదులు, రిజిస్టర్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ… చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని, ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో ఇష్టపడి చదవాలని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ చదవడం,రాయడం,మాట్లాడడం తప్పనిసరి అయిందని, విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు.ప్రాథమి కోన్నత పాఠశాల నుండి ఉన్నత పాఠశాలకు వచ్చిన 6వ తరగతి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో ఇష్టపడి చదవాలని,రాయడం, మాట్లాడడం నేర్చుకోవాలని తెలిపారు.ప్రాథమికోన్నత పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధుల పట్ల సమయపాలన పాటించాలని,విధులకు గైరహాజరు అయినట్లయితే ముందుగా అనుమతి పొందాలని తెలిపారు.10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు.అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి సదుపాయాలను కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని,బడిబాట కార్యక్రమం ద్వారా బడి బయట పిల్లలు, మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు చదువు ఆవశ్యకతను వివరించి తిరిగి పిల్లలు పాఠశాలలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.