ఖమ్మం ప్రతినిధి జూలై 31 (ప్రజాబలం) ఖమ్మం రెవెన్యూ సంబంధ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవిన్యూ అధికారులతో ధరణి, ప్రజావాణి, ధృవీకరణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల స్థాయిలో రెవిన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మండలంలోని డిటి, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అన్ని క్యాటగిరిలకు చట్టాలపై అవగాహన కలిగేలా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రెవిన్యూ అధికారులకు సబ్జెక్ట్ పై పూర్తి నాలెడ్జ్ ఉండాలన్నారు. తహసీల్దార్ కార్యాలయం స్పందించలేదు అనే మాట రావద్దన్నారు. ధరణి దరఖాస్తులు సమర్పించెప్పుడు మాడ్యూల్ ప్రకారం సంబంధిత అన్ని డాక్యుమెంట్లు జతచేయాలన్నారు. డాక్యుమెంట్ల పరిశీలన పక్కాగా చేయాలన్నారు. ప్రతి దరఖాస్తు సమర్పించిన నెలలోనే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ప్రతి మండల తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో ధరణి సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, దరఖాస్తు పెట్టే ముందు దరఖాస్తుదారునికి పూర్తి అవగాహన కలిగేలా గైడ్ చేయాలని అన్నారు. ప్రతి సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టాలని, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ప్రజావాణిలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సోమవారం సాయంత్రం శాఖల వారిగా దరఖాస్తుల పరిష్కారం పై నివేదిక సమర్పించాలని అన్నారు. ప్రతి శుక్రవారం శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, స్వీకరించిన అర్జీలపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగొద్దని కలెక్టర్ అన్నారు. ఎస్టీ, ఎస్సి, మానవ హక్కుల, గ్రీన్ ట్రిబ్యునల్ తదితర కమీషన్లకు నివేదికలు సమయంలోగా సమర్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తహసీల్దార్లు జారీచేసే కుల, ఆదాయ, నివాస తదితర ధృవీకరణల దరఖాస్తులు నిర్ణీత సమయంలోగా జారీ అయ్యేలా చూడాలన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల పరిశీలన పెండింగులు లేకుండా వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. విలువైన ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఫెన్సింగ్, ప్రభుత్వ భూమి అని నామసూచికల ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువుల భూముల విషయమై ఇర్రిగేషన్, రెవిన్యూ, గూగుల్ మ్యాపులు సరిచూసుకొని భూముల ఆక్రమణలు కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, ఆర్డీవోలు జి. గణేష్, ఎల్. రాజేందర్, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శ్రీనివాసులు, తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, ఆర్ఐ లు, సీనియర్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు