పోడు భూముల పట్టాల జారీపై సమీక్ష: జిల్లాలో అర్హులందరికీ పట్టాలు అందించాలి

సిరిసిల్ల ప్రజాబలం ప్రతినిధి: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కోండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) లు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పోడు భూముల పట్టాల జారీపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ నుంచి ప్రభుత్వ విప్‌, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ , జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ రa లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 507 దరఖాస్తులు సమర్పించగా, కేవలం 27 మందికే పట్టాలు జారీ అయినట్లు తెలిపారు. మిగిలిన అర్హులకు కూడా త్వరగా పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


జిల్లాలోని వీర్నపల్లి, కోనరావుపేట, చందుర్తి, గంభీరావుపేట, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో గిరిజనులకు పట్టాలు ఇంకా రాకపోవడం పట్ల ఆది శ్రీనివాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దరఖాస్తులపై క్షేత్రస్థాయి రీ సర్వే నిర్వహించి, అర్హులకు పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు.
వేములవాడ నియోజకవర్గం పరిధిలో మోత్కరావుపేట, చందుర్తి రోడ్డు పనులు అటవీ అనుమతుల కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయాయని, ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతే ఖానాపూర్‌ నుంచి హైదరాబాద్‌ కు వెళ్లే ప్రయాణ మార్గంలో 35 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు.
అటవీ ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి అవసరమైన అనుమతులు త్వరగా అందేలా చూడాలని, ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అధికారులను కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking