జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 30
జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిని శనివారం ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్ ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులకు నోచుకోకపోవడం సరికాదన్నారు. ఆస్పత్రిలో గుండె వైద్య నిపుణుడు ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇటీవల మృతి చెందిన అధికార పార్టీ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి, హుజురాబాద్ కు చెందిన అడ్వకేట్, జర్నలిస్ట్ శ్యామ్.. మైనర్ చెస్ట్ పెయిన్ వల్ల మృతి చెందారని వారికి సరైన సమయంలో తగు ట్రీట్మెంట్ అందినట్లయితే బతికేవారని పేర్కొన్నారు.
హుజురాబాద్ తో పాటు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజిస్ట్ ఉండాలని స్థానిక నియోజకవర్గ నాయకులు ఎందుకు ప్రభుత్వాన్ని అడగడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్, హన్మకొండ జిల్లా కేంద్రాల నడుమ ఉన్న హుజురాబాద్ నియోజకవర్గం ఇంకా ఎందుకు అభివృద్ధి చెందడం లేదని అడిగారు. విద్య, వైద్యం ఉపాధి పైన దృష్టి సారించాలని సూచించారు. విద్య, ఉపాధి ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ వైద్యం విషయమై వ్యవస్థలో నిర్లక్ష్యం వహించడం సరికాదని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం కొట్లాడుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో మెడికల్ కాలేజీ, కంపెనీల ఏర్పాటు కోసం నాయకులు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. సమర్థవంతులైన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు లకు ఈ విషయమై ఎందుకు వినతి పత్రాలు సమర్పించడం లేదని అడిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి సైతం ఫిట్ నెస్ టెస్టులు ఉండాలని అభిప్రాయపడ్డారు.