వేములవాడ టౌన్,( ప్రజాబలం ) ప్రతిని :- శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ సోమవారం రోజున శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సంబంధిత రిజిస్టర్ మరియు పరీక్షల నియంత్రణ అధికారికి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్మా అధ్యక్షులు వెంకటేశ్వర మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ హామీలను నెరవేర్చకపోవడం వలన రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు రెండవ, నాలుగవ మరియు ఆరవ సెమిస్టర్ పరీక్షల తేదీలను ప్రకటించకూడదని, అట్టి తేదీలను ప్రకటించి, పరీక్షలు నిర్వహించడానికి ముందుకు వచ్చినట్లయితే అట్టి పరీక్షలను బహిష్కరిస్తామని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత 20 నెలలుగా ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల చాలామంది ప్రైవేట్ కాలేజ్ ల యజమాన్యాలు అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో మీ వంతు పాత్ర పోషించాలని ఆయన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్మా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ఆయా చితుల జితేందర్ రావు, పోరగంటి విష్ణు పలు విద్యాసంస్థల కరస్పాండెంట్స్ పాల్గొన్నారు.