ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 30:ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినప్పుడు వాటికి అవసరమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టి కోర్టులో కేసులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ వెంకటయ్య పోలీసు శాఖవారిని కోరినారు.
సోమవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ వెంకటయ్య హాజరైనారు.ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు, కాని కేసుకు అవసరమైన సాక్ష్యాలను సరైన విధంగా సేకరించి కోర్టులలో బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు శాఖ వారు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి వాటిని తక్షణమే పరిష్కరించి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టే పౌరహక్కుల రక్షణ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్) – పీసీఆర్), అట్రాసిటీ నివారణ చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ – పీవోఏ) చట్టాలను ఖచ్చితంగా అమయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు ఉన్న కేసుల వివరాలు వాటి పురోగతి ని ఛైర్మన్ అడిగి తెలుసుకొన్నారు. ఈ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏమాత్రం పెండింగ్లో ఉంచరాదని ఆయన సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ కేసులపై విచారణ చర్యలను వేగవంతం చేసి సకాలంలో బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీంతో పాటు అధికారులు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు అయిన వెంటనే విచారణ దశలో ఉన్న బాధితులకు నిబంధనల మేరకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సభ్యులను ఈ సందర్భంగా చైర్మన్ కోరారు. అట్రాసిటీ కేసుల్లో అవసరమైన కుల దృవీకరణల జారీ లో చాలా వరకు జాప్యం జరుగుతుందని, అలా కాకుండా వీలైనంత తొందరగా ధృవీకరణలను జారీ చేయాలనిరెవెన్యూ అధికారులను కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సంబంధిత అధికారులు పూర్తి నిబద్దతతో తమ విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. కేసులు పెట్టిన వారిపై రకరకాల ఒత్తిడులు వస్తుంటాయని దీనిని దృష్టిలో పెట్టుకొని వారికి పోలీసులు, ఇతర శాఖలు అండగా నిలవాలని ఛైర్మన్ స్పష్టం చేశారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో కేసులు నమోదైన వెంటనే త్వరితగతిన దర్యాప్తు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.
అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులు వారి వారి సమస్యలను ఛైర్మన్ కు విన్నవించుకోగా, ఛైర్మన్ స్పందిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి కోటిరెడ్డి, బాలానగర్ డిసిపి సురేష్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, రాచకొండ, సైబరాబాద్ పోలీసు అధికారులు, జిల్లా ఏస్సి,ఏస్టి కమీటీ మెంబర్లు వెంకటేష్, ధనరాజ్ నాయక్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అభివృద్ది అధికారి వినోద్ కుమార్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking