రిశికేశ్‌ నుండి అంతర్జాతీయ యోగ టీచర్‌ ట్రైనింగ్‌ సర్టిఫికేట్‌ పొందిన శంకరాచార్య

మేడ్చల్‌ జిల్లా ప్రజాబలం ప్రతినిధి: జవర్‌ నగర్‌ వాసి అయిన జర్నలిస్ట్‌ శంకరాచారి ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో యోగ నగరిగా పిలువబడే రిశికేశ్‌ లోని అప్పర్‌ తపోవన్‌ లో నెల రోజులపాటు హఠ యోగ, అష్టాంగ విన్యాస యోగ, పతంజలి యోగ విద్యలో సాధనను విజయవంతంగా పూర్తిచేసుకుని అంతర్జాతీయ యోగ టీచర్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ను పొందారు. వివరాలలోకి వెళ్తే రిశికేశ్‌ లో ప్రముఖ యోగ ఆశ్రమమైన రుద్రయోగ్‌ పీట్‌ లో ప్రసిద్ది చెందిన యోగ గురువు గగన్‌ జైన్‌ వద్ద హఠ యోగవిద్యను, అనుజ్‌ ఆచార్య వద్ద అష్టాంగ యోగవిద్య, అజయ్‌ ఆచార్య వద్దనుండి పతంజలి యోగను నేర్చుకున్నారు. ఇందులో భాగంగా షట్‌ క్రియలు వివిధ రకాల యోగాసనాలు, ఉజ్జాయిని భస్త్రికాది ప్రాణాయామాలు, బంధనాలు వాటి ప్రయోజనాలు, ధ్యానం, యోగ నిద్ర, సాంఖ్యయోగం, శరీర నిర్మాణ శాస్త్రం మొదలగు అనేక యోగరహస్యాలను అభ్యసించి నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నేను నేర్చుకున్నది అణువంత నేర్చుకోవాల్సింది కొండంత ఉందని, నిత్య విద్యార్థిగా ఉంటూ నేను నేర్చిన యోగ విద్యను పదిమందికి నేర్పుతూ వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచే ప్రయత్నం చేస్తానన్నారు. పరమేశ్వరుడు లోకహితం కోరి హఠ యోగ ను అందించగా, పతంజలి మహర్షి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసములను మధించి అందులో ఉన్న యోగ సాధనములపై పరిశోధనలు జరిపి దారమున మనులను గూర్చినట్లు యోగమును ఒక్కచోట చేర్చినాడని, అవే ఈ రోజు పతంజలి యోగసుత్రముల పేరిట లోక ప్రసింది చెందినవని తెలియజేశారు. ఈ యోగమును వయోబేధము, తరతమ బేధము లేకుండా ప్రతిఒక్కరూ అను నిత్యం సోమరితనం లేకుండా సాధన చేయడం వలన సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యం తోపాటు ఆనందాన్ని, ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందవచ్చని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking