నాందేడ్ లో శంఖ‌రావం

భారత రాష్ట్ర సమితి అధినేత హోదాలో సీఎం కేసీఆర్‌ తొలిసారి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో అడుగిడుతున్నారు. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో తొలి జాతీయ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఆదివారం నాందేడ్‌లో జరగనున్న సభలో బీఆర్‌ఎస్‌ శంఖాన్ని పూరించనున్నారు. ఇప్పటికే భారీ ఏర్పాట్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిజీగా ఉన్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ మహారాష్ట్ర ప్రజల శతాబ్దాల మైత్రీ బంధం మరింత బలోపేతమై దేశ రాజకీయాలలో నవశకానికి నాంది ప‌లుక‌ల‌నున్నారు కేసీఆర్. మహారాష్ట్రలోని నాందేడ్ లో జరగనున్న బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేందుకు ప్రణాళికలు మొదలు పెట్టిన ఈ సమయంలో నాందేడ్ లో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా పార్టీ నాయకులు రంగంలోకి దిగారు.

మహారాష్ట్ర నవ నిర్మాణంలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంత గొప్పదో, తెలంగాణ వికాస ప్రస్థానంలో మహారాష్ట్ర ప్రజల పాత్ర అందుకు ఏమాత్రం తీసిపోనిది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల మధ్య భౌగోళిక, భాష, సాంస్కృతిక, రాజకీయ, ఉద్యమ అనుబంధం ఈనాటిది కాదు. ఇవాల్టి మహారాష్ట్రలోని సగ భాగం ఒకప్పటి హైదరాబాద్‌ రాజ్యంలో, ఆ తర్వాత ఏర్పడిన హైదరాబాద్‌ రాష్ట్రంలో అంతర్భాగం. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని వర్లీ, బోయివాడ, మాతుంగ, దాదర్‌, నవీ ముంబయి ప్రాంతాల్లో పర్యటిస్తే తెలంగాణలో ఉన్నామా అన్న అనుభూతి కలుగక మానదు

ఎన్నికలొచ్చినప్పుడు ఈ రెండు రాష్ట్రాల అభ్యర్థులు పరస్పరం సహకరించుకోవడం, ప్రచారాల్లో పాల్గొనటం పరిపాటిగా వస్తున్నది. మరాఠా పత్రికలు చదివే, ఛానళ్ళను చూసే తెలంగాణ ప్రాంత ప్రజలున్నట్టే తెలుగు మీడియాను అనుసరించే మహారాష్ట్ర ప్రాంత ప్రజలూ లక్షల్లో ఉన్నారు. మన దగ్గర మరాఠీ మీడియం ఉన్నట్లే అక్కడ తెలుగు మీడియం విద్యాసంస్థలున్నాయి. ఇక్కడ మరాఠా సంఘాలున్నట్లే అక్కడ తెలుగు సంఘాలున్నాయి.

షోలాపూర్‌ మొదలుకొని భివాండి దాకా వివిధ పరిశ్రమలను ప్రత్యేకించి వస్త్ర పరిశ్రమను శిఖరాయమానంగా నిలబెట్టిన శ్రమజీవులు తెలంగాణ బిడ్డలే. ముంబయి వికాస ప్రస్థానంలో తెలంగాణ ప్రజల పాత్రను నిర్ధారిస్తూ వివిధ భాషల్లో ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. మహారాష్ట్రకు చెందిన శివరాజ్‌ పాటిల్‌ కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా దేశ రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తే, నాగపూర్‌లో విద్యాభ్యాసం చేసిన పి.వి.నరసింహారావు దేశ ప్రధానమంత్రి అయ్యారు.

ముంబయిలో 12 లక్షలు, షోలాపూర్‌లో 3 లక్షలు, పుణేలో లక్ష, నాగపూర్‌, నాందేడ్‌, జాల్నా, దెగ్లూర్‌, రామ్‌టెక్‌ తదితర పట్టణాల్లో ప్రభావితం చేయగలిగిన స్థాయిలో మన వాళ్ళున్నారు. అలాగే తెలంగాణలోని నారాయణ్‌ ఖేడ్‌, జుక్కల్‌, బోధన్‌, నిజామాబాద్‌, బాన్స్‌వాడ, మధోల్‌, బోధన్‌, ఆదిలాబాద్‌, కాగజ్‌ నగర్‌ వంటి సరిహద్దు పట్టణ ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడేవారు అడుగడుగునా క‌నిపిస్తారు. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర మంది మరాఠీ బిడ్డలు స్థిరపడ్డారు. మహారాష్ట్ర సంప్రదాయ కులాల వారు తెలంగాణలో అధిక సంఖ్యలో ఉండగా, ఇక్కడి పద్మశాలీలు మహారాష్ట్రను మలుపు తిప్పగల స్థాయిలో ఉన్నారు.

మహారాష్ట్రలోని రామ్‌టెక్‌ నియోజక వర్గానికి పీవీ రెండుసార్లు ప్రాతినిధ్యం కూడా వహించారు. మరాఠా భూమిపుత్రులు వినాయకరావు కౌరాట్కర్ హైదరాబాద్‌ నుంచి, హరీశ్చంద్ర హెడా నిజామాబాద్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఒక అంచనా ప్రకారం వర్తమాన మహారాష్ట్రలో 30 లక్షల మంది తెలుగు వారున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు.

షోలాపూర్‌ నుంచి ముంబయి దాకా స్థిరపడిన తెలంగాణ బిడ్డలు తెలంగాణ మలి దశ ఉద్యమంలో అపారమైన మద్దతు ప్రకటించి ఉద్యమసారధి కేసీఆర్‌ వెంట నడిచారు. షోలాపూర్‌ నుంచి ముంబయి దాకా స్థిరపడిన తెలంగాణ బిడ్డలు తెలంగాణ మలి దశ ఉద్యమంలో అపారమైన మద్దతు ప్రకటించి ఉద్యమసారధి కేసీఆర్‌ వెంట నడిచారు. ఉభయ రాష్ట్రాల రచయితలు, కళాకారులు అటు ఇటు పర్యటనలు జరుపుతున్నారు. సభలు నిర్వహిస్తున్నారు. 2017లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు మహారాష్ట్ర సాంస్కృతిక సాహిత్యకారులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇవాళ ఏకంగా, తెలంగాణ సంక్షేమ అభివృద్ధి పథకాలను మాకు అమలు చేయండి, లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అని మహారాష్ట్రలోని వివిధ గ్రామాల్లో ప్రజలు తీర్మానాలు చేస్తున్నారు.

రెండు జీవనదులు కృష్ణా, గోదావరి ఒక పేగుబంధమైతే, రెండు రాష్ట్రాల్లో సరిహద్దు జిల్లాలు, సమీప జిల్లాలు గణనీయంగా ఉన్నాయి. నాందేడ్‌, యావత్మల్‌, చంద్రపూర్‌, గడ్చిరోలి జిల్లాలు అక్కడి సరిహద్దు జిల్లాలు కాగా ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ ఇటువైపు జిల్లాలు. ఇక షోలాపూర్‌, ఉస్మానాబాద్‌, అకోలా, అమరావతి, నాగపూర్‌, రామ్‌టెక్‌ ప్రాంతాలు తెలంగాణ ప్రజలతో, ప్రాంతంతో పెనవేసుకున్నవే.

బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన చేరికల సమావేశం గురించి ఇక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చించుకొంటున్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు లాంటి పథకాలుంటే ఇక రైతులకు కావాల్సిందేమిటని రైతులు అంటున్నారు. పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలను వాహనాలపై వెళ్తున్న వారు ఆగి మరీ చదువుతూ కనిపించారు. నాందేడ్‌ జిల్లా కేంద్రంలో రెండు శాసనసభ నియోజకవర్గాలుండగా, జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

తెలంగాణ సరిహద్దు జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు జట్లుగా విడిపోయి ఆయా నియోజకవర్గాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో ప్రజలు తెలంగాణ సర్కారు, సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకొంటున్నారు. నాందేడ్‌ జిల్లా ప్రజలకు తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలతో బంధుత్వాలు ఉన్నాయి. తెలంగాణ పథకాలపై వారికి అవగాహన ఉండటంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వయోజనులు వృద్ధాప్య పింఛన్ల గురించి తెలుసుకొంటున్నారు. తెలంగాణలో ప్రతినెలా రూ.2 వేలు వృద్ధాప్య పింఛన్‌ పొందుతుంటే, తమకు రూ.500 మాత్రమే అందుతున్నాయని బాధపడుతున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా అనేకమంది ప్రజా ప్రతినిధులు ఇటీవల కేసీఆర్ ను కలిశారు. ఇదే క్రమంలో నాందేడ్ బహిరంగ సభలో పెద్ద ఎత్తున చేరికలు జరిగేలా నేతలు గ్రామాల వారీగా తిరుగుతున్నారు. ఒకవైపు చేరికలపై సన్నాహాలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల దష్ట్యా తొలిసారి పొరుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ సభను జరుపుతుండటంతో ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీల దృష్టి నాందేడ్ సభపై పడింది.

నాందేడ్ నగరంలోని గురుగోవింద్ సింగ్ మైదానం బీఆర్ఎస్ తొలి రాష్టేతర సభను కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి ఆవిర్భావ సభ ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. తర్వాత నాందేడ్ లో సభను నిర్వహించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పటివరకు జరిగిన కేసీఆర్ సభలకు ఏమాత్రం తీసిపోకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది పార్టీ నాయకత్వం. భారీ బహిరంగ సభ ఏర్పాట్లను వారం రోజులుగా కీలక నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

మహారాష్ట్ర ఏర్పడి 60 ఏండ్లయినా నేటికీ దక్షిణ మహారాష్ట్ర-ఉత్తర కర్ణాటక సరిహద్దు తగాదాలు, తూర్పు మహారాష్ట్రలో మంచి నీళ్ల కోసం మహిళలు బిందెలతో మైళ్ళకు మైళ్ళు నడిచే దుస్థితి, విదర్భ ప్రాంతపు వెనుకబాటుతనం, చెరకు రైతుల సమస్యలు, ప్రతి వానకాలంలో మునిగి తేలుతున్న ముంబయి… ఇలాంటి ఎన్నెన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. వాటిని పరిష్కరించి ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టగలిగే నేత కోసం అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking