మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల మొదటి రోజైన శుక్రవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఆరు నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ మేరకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకటి, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయని పేర్కొన్నారు. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శ్రీధర్రెడ్డి జిన్న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయగా… అదే నియోజకవర్గం నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి గౌని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అలాగే మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి జాజుల భాస్కర్ శ్రమజీవి పార్టీ నుంచి, కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి చంద్రశేఖర్ చలిక స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం నుంచి వేరే చిన్న ధనరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా… అదే నియోజకవర్గం నుంచి ఎం.మల్లేశం తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ నుంచి నామినేషన్ వేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ మేరకు కుత్భుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఒక్క నామినేషన్ కూడా రాలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు.