ఇంతకీ”రేవంత్”ది బస్సుయాత్రనా..పాదయాత్రనా..?

 

తలలుపట్టుకొంటున్న కాంగ్రెసోళ్లు

జీవన్ కు షుగర్ ఫ్యాక్టరీపై మాట్లాడే అర్హతలేదు

ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకే రేవంత్ ఎత్తుగడ

బిజెపి నేత, మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రావణి

జగిత్యాల, మార్చి 13, (ప్రజాబలం ప్రతినిధి)కేంద్రంలో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని, ఎంతో చేసిన ఘనత ఎంపీ అర్వింద్ కు దక్కుతుందని, షుగర్ ఫ్యాక్టరీపై జీవన్ రెడ్డికి మాట్లాడే అర్హతలేదని, ఇక రేవంత్ రెడ్డిది బస్సుయాత్రనా..పాదయాత్ర నా అని కాంగ్రెస్ పార్టీ వాళ్లే తలలు పట్టుకొంటున్నారని బిజేపి నేత, మాజీ మునిసిపల్ చైర్మన్ బోగ శ్రావణి అన్నారు. సోమవారం స్థానిక ఒక హోటల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రావణి మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికే రేవంత్ రెడ్డి పాదయాత్ర పేరిట బస్సుయాత్రను మొదలెట్టాడన్నారు. ఈ పర్యటనలో భాగంగా జగిత్యాలకు వచ్చిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీ అర్వింద్ పై లేనిపోని ఆరోపణలు చేశాడని శ్రావణి అన్నారు. అర్వింద్ ఏమిచేశాడని ప్రశ్నించే ముందు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉండి రైతుల సంక్షేమం కోసం, ప్రజల కోసం ఏమిచేశారో చెప్పాలని శ్రావణి ప్రశ్నించారు. ధర్మపురి అర్వింద్ పసుపు రైతులకు మద్దతు ధర కల్పనతోపాటు సుగంధ ద్రవ్యాల రీజనల్ బోర్డును ఏర్పాటు చేశారన్నారు. అలాగే ఈ ప్రాంత మామిడి రైతుల ప్రయోజనం కోసం జగిత్యాల టూ డిల్లీకి కిసాన్ రైలును ఏర్పాటు చేయించాడని కొనియాడారు. ఎన్నో ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్ని రైళ్లు వేయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని శ్రావణి ప్రశ్నించారు. ఇక అసలు ముచ్చటలో రేవంత్ రెడ్డిది బస్సుయాత్రనా.. పాదయాత్రనా అనే అనుమానాలతో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు సతమతమవుతున్నారని శ్రావణి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడు యావర్ రోడ్డు విస్తరణ గుర్తులేదని ఇప్పుడు ప్రశ్నించడం మొదలెట్టాడని శ్రావణి అన్నారు. తన పర్యటనలో జగిత్యాలకు వచ్చిన రేవంత్ రెడ్డి యవర్ రోడ్డు విస్తరణపై ప్రశ్నించాడని అయితే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి పనిచేసినప్పుడు ఎందుకు విస్తరణ చేయలేదో అడిగి తెలుసుకోవాలని రేవంత్ కు శ్రావణి సూచించారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై జీవన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని 2005 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ పై హౌస్ కమిటీలో సభ్యుడైన జీవన్ రెడ్డిని ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదో జవాబు చెప్పాలని శ్రావణి ప్రశ్నించారు. బీఆర్ ఎస్, బీజేపీ రెండు ఒకటేనని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డురంగా ఉన్నాయని మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ఉద్యమించేందుకు వెళ్లిన బీఆర్ ఎస్ మహిళా నాయకులు ఉత్తమ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన భార్యతో భేటి అయ్యారని కాంగ్రెస్, బీఆర్ ఎస్ రెండు ఒకటేననేందుకు ఈ ఉదాహరణ చాలదా అని శ్రావణి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బోగ శ్రావణి చెప్పారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ చిలకమర్రి మదన్ మోహన్, పట్టణ అద్యక్షులు అనిల్, రూరల్ అద్యక్షులు తిరుపతి, సారంగపూర్ అద్యక్షులు అరుణ్, రంగు గోపాల్, మోహన్ రెడ్డి, ఉమేష్, ప్రశాంత్, రాజశేఖర్, సురేష్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking