రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్లు నెంబర్లు 040-24601010 ఏర్పాటు
విద్యార్థుల కోసం టెలీమానస్ నెంబర్ 14416 ద్వారా ఉచిత కౌన్సిలింగ్ సదుపాయం
మేడ్చల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 13: రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణలతో కలిసి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు.
జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు
వీడియో కాన్ఫరెన్స్లో వివరించిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
*జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు కంట్రోల్ రూం నంబర్ 040-27118584 ఏర్పాటు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు 133 పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసామని, నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, ఫర్నీచర్ ఏర్పాటు చేసినట్లు అన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని, పరిసరాలలో ఉన్న జిరాక్స్ షాపులు మూసివేస్తామని, పరీక్షలలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ ఇంటర్మీడియట్ పరీక్షలకు పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో జనరల్ 62,342 మంది విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులో 1,452 మంది మొత్తం 63,794 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్లో 54,146 మంది, ఒకేషన్ కోర్సులో 995 విద్యార్థులు మొత్తం 55.141 పరీక్షలు రాస్తారని వివరించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జనరల్లో 1,16,488 మంది, ఒకేషనల్ కోర్సులో 2,447 మంది విద్యార్థులు మొత్తం 1,18,935 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో వారు నిర్వహించాల్సిన విధులకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో ముందస్తుగానే సమావేశాలు నిర్వహించామని ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. ఇప్పటివరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియట్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.