ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం మంచిర్యాల పట్టణంలోని సాయి కుంట లో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తో కలిసి ఆకస్మికంగా సందర్శించి పాఠశాల పరిసరాలు, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత,గదులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు విశిష్టమైన చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన విద్య అందించడంతోపాటు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమన్వయంతో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు అవసరమైన వైద్య పరీక్షలు చేపట్టి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.