రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 25: ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి బాగోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని విద్యార్థులపై వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని పాఠశాలలకు పంపిస్తారని వారికి ఉపాధ్యాయులు తోడ్పాటునందించాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన అన్నారు.
శనివారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కౌకూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్, టీచర్ సమావేశానికి దేవసేన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థినీ, విద్యార్థులు తమ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారని అదే విధంగా అధికారులు, ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల బాగోగులే అంతిమ లక్ష్యంగా పని చేస్తూ వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థులు వారినికి నచ్చిన రంగంలో రాణించడానికి కృషి చేయాలని ఈ విషయంలో విద్యార్థులతో ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ సహకరించి ప్రోత్సహించాలని దేవసేన పేర్కొన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, సెక్టోరల్ అధికారి రవీందర్ రాజు పలు విషయాలపై విద్యార్థుల తల్లి దండ్రులతో చర్చించారు. ఈ సందర్భంగా కొన్ని హృద్యమైన సంఘటనల గురించి పేరెంట్స్ చెప్పడంతో రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన స్పందించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది. అనంతరం జిల్లా విద్యాశాక అధికారిణి విజయకుమారి మాట్లాడుతూ కౌకూర్ పాఠశాల అన్ని విధాలుగా విద్యార్థులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తోందని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ, పాఠశాల విద్యా కమిటి ఛైర్మన్ యేసుమణి, ఉపాధ్యాయులు దశరథ్, రవీందర్ రెడ్డి, నర్సింహ, పారిజాత, రమ, విద్యార్థుల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.