చెక్పోస్టుల వద్ద ఇరవై నాలుగు గంటల పాటు తనిఖీలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్వ్కాడ్, స్టాటిక్ సర్వేయలెన్స్ టీం తదితర బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆ బృందాలన్ని పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలో శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియావళి ఉల్లంఘనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకునే క్రమంలో జిల్లాలో ఎన్నికల విధులను అధికారులు, సిబ్బంది పకడ్భందీగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు వెబ్క్యాస్టింగ్, జీపీఎస్ స్ట్రీమింగ్కు సంబంధించిన టీమ్కు నోడల్ అధికారులుగా జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఖాసిమ్ వ్యవహరిస్తారని గౌతమ్ పేర్కొన్నారు. ఈ బృందం జిల్లాలో ఉన్న పది చెక్పోస్టుల వద్ద ఇరవై నాలుగు గంటల పాటు ఉంటారని… వెబ్ కెమెరాలు సైతం ఇరవై నాలుగు గంటల పాటు మానిటరింగ్ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. దీంతో పాటు ఫ్లయింగ్ స్వ్కాడ్ టీమ్కు సంబంధించి పది బృందాలను ఏర్పాటు చేయగా దీనికి జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఖాసిమ్ ఆధ్వర్యంలో పని చేస్తాయని వెల్లడించారు. ఈ బృందం సైతం ఇరవై నాలుగు గంటల పాటు వెబ్క్యామ్, జీపీఎస్తో ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా వీటన్నింటికి సంబంధించి జిల్లా కలెక్టరేట్లోని ఎఫ్–12లో మానిటరింగ్ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించారు. సర్వే లైన్ బృందాలు, చెక్ పోస్టులలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు జిల్లా నుంచి సైతం అన్ని నియోజవర్గాల పనితీరును పర్యవేక్షించడం జరుగుతోందని గౌతమ్ పేర్కొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు సెలవులతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటల పాటు తనిఖీలు చేపట్టాలని, విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఎన్నికల ప్రవర్తన నియావళి మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సిబ్బంది అందరు విధిగా బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. దీంతో పాటు రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజు నివేదికలను పంపించాలని… జారీచేసిన అనుమతులకు మించి వాహనాలను వాడకుండా చూడాలని, సభలు, సమావేశాల వివరాలు ఖచ్చితంగా బృందాలు వీడియో రికార్డు చేయించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ సూచించారు. అలాగే ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బంది సరిపోనట్లయితే అవసరం మేరకు అదనపు సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.