మేడ్చల్ – మల్కాజిగిరి జిల్ల ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఈ విషయంలో అభ్యర్థులు ఎన్నికల కమిషన్ సూచించిన డబ్బుల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లయితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దీనిపై నిక్కచ్చిగా వ్యవహరించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ విషయంలో ప్రతి రోజూ ఉదయం టిఫిన్ నుంచి మొదలుకొని ప్రచారం తదితర కార్యక్రమాలు ముగిసే సమయం వరకు ఎన్నికల సంఘం రేట్లను నిర్ణయించిందని దాని ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జిల్లా అధికారులకు సహకరించాల్సిందిగా సూచించారు. ఒక్కో పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి ఖర్చు ఎన్నికల్లో రూ.40 లక్షలకు మించొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయని ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించారు. శాసనసభ ఎన్నికలలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల రోజువారీగా చేసే ఖర్చు వివరాలు పక్కాగా నమోదు చేయాలని భారత ఎన్నికల సంఘం పక్కా ప్రణాళిక రూపొందించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.40 లక్షలకు మించి వ్యయం చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో రోజు వారీ ఖర్చు వివరాల సేకరణపై ఎన్నికల వ్యయ పరిశీలకులుగా జిల్లా ట్రెజరీ అధికారి యాదగిరి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్రావు వ్యవహరిస్తారని వారు ప్రతిరోజూ ఆయా పార్టీలకు సంబంధించిన ఎన్నికల ఖర్చుల వివరాలను సేకరిస్తారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు చేసే ప్రతి పనికి అయ్యే ధరల వివరాలను ఎన్నికల కమిషన్ రూపొందించిందని దాని ప్రకారం ఎక్కడెక్కడ ఏఏ కార్యక్రమాలు నిర్వహించినా ఎన్నికల కమిషన్ ప్రకారం ఖర్చులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయని… ఎన్నికల కమిషన్ నిర్ణయించిన నిర్ణీత ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చయినట్లయితే సంబంధిత అభ్యర్థిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ అన్ని రకాల పకడ్భందీ కార్యాచరణతో ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లాలోని అధికారులు అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిరంతరం నిఘా ఉంటుందని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులకు సంబంధించి వారు ఖర్చుపై వ్యయ పరిశీలకులు నిరంతరం నిఘా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా వ్యయ పరిశీలన బృందం ఖర్చు వివ రాలను ఎప్పటికప్పుడు షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ నమోదు చేసేలా చర్యలు అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని గౌతమ్ వెల్లడించారు. అభ్యర్థులు వ్యయం వివరాలను రెండు రోజులకు ఒకమారు అధికారులకు సమర్పించాలని లేనట్లయితే వారికి నోటీసులు అందించడం జరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. అలాగే అభ్యర్థులు ఎన్నికల ప్రచార సమయంలో ఖర్చుకు సంబందించి లెక్కలను సక్రమంగా నిర్వహించాలని, లేనట్లయితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని తెలిపారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులు వెచ్చించే ఖర్చు వివరాలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.