ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 03 : దివ్యాంగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వరూపారాణితో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దివ్యాంగుల పరిరక్షణ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, దివ్యాంగులకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ఏర్పాటుపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగుల సమస్యలపై ఆన్లైన్లో ఉన్న నంబర్కు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసినట్లయితే పరిష్కారంపై ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగుల సౌకర్యార్థం ట్రై సైకిళ్ళు అందించడం జరుగుతుందని తెలిపారు. సంకల్పం, మనోధైర్యంతో ముందుకు సాగాలని, అన్ని రంగాలలో దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించడం జరిగిందనని, దివ్యాంగులు అందరితో సమానంగా రాణించవచ్చని, ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సహిస్తుందని తెలిపారు.దివ్యాంగులుగా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి ఎన్నో సేవలు అందిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి.దుర్గాప్రసాద్, ఎస్.సి.అభివృద్ధి శాఖ అధికారి రవీందర్రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, సంబంధిత శాఖల అధికారులు,దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.