రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 04 :

మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో రోడ్లు-భవనాలు, పోలీస్,ట్రాఫిక్, జాతీయ రహదారులు, రవాణా,ఆబ్కారీ-మద్యనిషేధ శాఖల అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై కొన్ని ప్రాంతాలలో సరైన విద్యుత్ దీపాలు లేకపోవడంతో ప్రమాదాలకు అవకాశం ఉంటుందని, ఈ విషయంపై జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించి సకాలంలో లైటింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని, మూలమలుపు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో వాహనదారులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనాల వేగాన్ని నిరోధించే విధంగా వేగపరిమితి బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలోని షాపింగ్ మాల్స్, బహుళ అంతస్తుల భవనాలలో తప్పనిసరిగా వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక స్థలాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, మార్కెట్ ప్రాంతాలలో వీధి విక్రయదారులు రోడ్లపై కూరగాయలు, ఇతర వ్యాపారాలు జరుపకుండా ప్రత్యేక స్థలాలు కేటాయించాలని తెలిపారు. రహదారులపైకి వచ్చిన పశువులను అదుపులోకి తీసుకొని ప్రత్యేక స్థలంలో ఉంచి వాటి యజమానులు వచ్చినప్పుడు జరిమానా విధించాలని, రహదారులు, మూలమలుపు, అటవీ చెకోపోస్టుల వద్ద రేడియంను వినియోగించి సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలోని జన్నారం – పొనకల్ బస్టాండ్ ప్రాంతంలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నందున నివారించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, కె.జి. వీల్స్ కారణంగా రహదారులు పాడవకుండా మొదటిసారి హెచ్చరించాలని, మళ్ళీ వచ్చినట్లయితే తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరదల కారణంగా దెబ్బతిని రహదారుల మరమ్మత్తుల కొరకు చేపట్టవలసిన చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking