పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా చూడాలి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి మార్చి 9:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాను పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్దం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారిణి విజయకుమారి తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్దతపై జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులతో గురువారం కూకట్పల్లిలోని పీఎన్ఎమ్ పాఠశాలలో జ్యోతి ప్రజ్వలన చేసి రెండు రోజుల పాటు జరిగే సమీక్ష సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారిణి విజయకుమారి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గణితం భౌతికశాస్త్రం, జీవశాస్త్ర ఉపాధ్యాయుల ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ మేరకు పదో తరగతి ప్రీ ఫైనల్ –1 రిజల్ట్ పాఠశాలల వారీగా ఒక్కో ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. ఆయా పాఠశాలల్లో తక్కువ ఉత్తీర్ణత శాతం వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులను అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని సీ – గ్రేడ్ విద్యార్థులను ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు నియమించి రాబోయే ముప్పై రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లాలో అన్ని పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత వచ్చే విధంగా ప్రతి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ద్వారా ప్రత్యేకంగా చేపడుతున్న తొలిమెట్టు, మన ఊరు– మన బడి, బడి బయట పిల్లల సర్వే పలు అంశాలపై కూడా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ సెక్రటరీ, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.