జాతీయ రహదారుల నిర్మాణాల్లో వేగం పెంచాలి

ప్రజా రవాణా కోసం విలువైన భూములిచ్చే రైతుల త్యాగాలు గుర్తించాలి

భూ నిర్వాసితులు నష్టపోకుండా పరిహారం అందించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు

హైదరాబాద్ ప్రతినిధి జనవరి 8 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాకు మణిహారంగా మారనున్న అన్ని జాతీయ రహదారుల నిర్మాణాల్లో వేగం పెంచాలని వ్యవసాయ, మార్కెటింక్ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పనుల పురోగతి, రైతులకు అందించే పరిహారంపై ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షించారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అమరావతి -నాగ్ పూర్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులకు సంబంధించిన పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే కు సంబంధించి ఖమ్మం జిల్లా, తెలంగాణ సరిహద్దు వరకు ఎంట్రీ, ఎగ్జిట్ పాస్ ల నిర్మాణం ఎక్కడెక్కడ చేపడుతున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారికి విజయవాడ-జగదల్ పూర్ హైవే వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే కు ప్రవేశ, ముగింపు ద్వారాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫలితంగా సత్తుపల్లి ప్రాంత ప్రజలతోపాటు నూజివీడు, తిరువూరు ప్రాంతాల వాసులకు రవాణా సౌకర్యం సౌలభ్యంగా ఉంటుందన్నారు. అమరావతి-నాగ్ పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే కు సంబంధించిన అలైన్ మెంట్ పై పునపరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధరలకు అనుగుణంగా భూ సేకరణకు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి కోసం కొత్తగా చేపట్టే భూసేకరణలో నిర్వాసితులకు ఎక్కడా  అన్యాయం జరగకుండా చూడాలన్నారు. నిర్వాసిత రైతుల భూముల ధరలు మార్కెట్ రేట్ల కన్నా అధికంగా పరిహారం చెల్లించేలా చూడాలన్నారు. ప్రజా రవాణా కోసం విలువైన భూములు ఇస్తున్న రైతుల త్యాగాలు గుర్తించి వారికి న్యాయం చేయాలన్నారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే లో ఖమ్మం నియోజకవర్గం పరిధిలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో సర్వీసు రోడ్లు, అండర్ పాస్ లు ఏర్పాటు చేయాలన్నారు. రైతులు, ప్రజల రవాణాకు అనుకూలంగా ఉండేలా అన్నిరకాల వాహనాలు రాకపోకలు సాగించేలా, రైతుల ఉత్పత్తులు తరలించుకునే విధంగా అండర్ పాస్ లు చేపట్టాలన్నారు. గ్రీన్ ఫీల్డ్ రహదారికి భూములు ఇచ్చిన రైతులతోపాటు, రహదారి పక్కనే సాగు చేసుకునే రైతాంగానికి భవిష్యత్తులో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా  చూడాలని మంత్రి తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాసరాజుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking