తల్లి మాట కోసం ఎస్ఆర్ఐ రామకృష్ణ ప్రపంచ యాత్రకు శ్రీకారం

తల్లి మాట కోసం ఎస్ఆర్ఐ రామకృష్ణ ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఓ సొంత యూట్యూబ్ చానెల్ను స్థాపించి ప్రపంచ యాత్రను ప్రారంభించాడు. పాత వరంగల్ జిల్లా జనగామ పట్టణానికి చెందిన గందె రామకృష్ణ ప్రస్తుతం యూఎస్ఏ సొంత కంపెనీని స్థాపించి దానికి సీఈవోగా పనిచేస్తున్నాడు. జనవరి 1న ప్రారంభించిన ప్రపంచ యాత్ర డిసెంబర్ 31 నాటికి ముగుస్తుందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ వెల్లడించారు. తన చిన్నతనంలో తల్లికి ఓ ప్రమాదంలో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయని, అయినా కవయిత్రి, రచయిత్రిగా మారి తన తల్లి తనను పోషించి ప్రయోజకుడిని చేసిందన్నారు. బొమ్మరిల్లు లాంటి పుస్తకాల్లో అనేక రచనలు, కథలు రాసి రివార్డులు, ప్రశంసలు అందుకున్నారన్నారు. గత ఏడాది ఆమె అనారోగ్యంతో మృతిచెందారని, బతికున్న సమయంలో ఆమెకు ఒక యూట్యూబ్ చానెల్ను ప్రారంభించి తన రచనలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆకాంక్షించారన్నారు. కాని గత ఏడాది అనారోగ్యంతో 60వ ఏట మృతిచెందారన్నారు. ఆమె చివరి కోరిక తీర్చాలన్న ఉద్దేశ్యంతో తాను అన్ని వదిలి ఆర్కె వరల్డ్ ట్రావెలర్ పేరుతో యూట్యూబ్ చానెల్ను స్థాపించానని, ఈ ఏడాది జనవరి 1న తన ప్రపంచ యాత్రను ప్రారంభించానని, డిసెంబర్ 31 నాటికి వంద దేశాలు తిరిగి ఆ దేశాల విశిష్టతను యూట్యూబ్లో పొందుపరుస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking