పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ సమర్థవంతంగా నిర్వహించాలి రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ అధికారి సి.సుదర్శన్ రెడ్డి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 24 : పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా ఇంటింటి ఓటరు జాబితా సర్వే కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ అధికారి సి.సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు,కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, పట్టభద్రుల ఎం.ఎల్.సి.ఎన్నికల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ అధికారి మాట్లాడుతూ… నూతన ఓటరు నమోదు,జాబితా మార్పులు, చేర్పులు, తొలగింపుల కొరకు ఫారం 6,7,8 ల ద్వారా అందిన దరఖాస్తులను పరిష్కరించడంతో పాటు మాసాంతం లోగా ఇంటింటా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించి కొన్ని అంశాలను పర్యవేక్షించారని తెలిపారు.బూత్ స్థాయి అధికారులకు బి.ఎల్.ఓ.యాప్ వినియోగంపై పూర్తి అవగాహన ఉండాలని, సూపర్వైజర్లు అందుబాటులో ఉండాలని,వివరాల నమోదు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.ఇంటింటా సర్వేపై క్షేత్రస్థాయిలో ప్రజలకు సమాచారం అందించాలని,సర్వే సమయంలో ఇంటికి తాళం ఉన్నట్లయితే 2వ సారి సందర్శించాలని తెలిపారు. ఏప్రిల్ తరువాత నమోదైన నూతన ఓటర్ల వివరాలను ఎపిక్ కార్డుల ముద్రణ కొరకు అందించాలని ఆదేశించారు.పోలింగ్ కేంద్రం ఫొటోను సంబంధిత బూత్ స్థాయి అధికారి తమ మొబైల్ నుండి అప్లోడ్ చేయాలని,నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కొరకు ప్రతిపాదనలు అందించి పూర్తి స్థాయి ఆమోదం తరువాత హేతుబద్దీకరణ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ముందస్తు హేతుబద్దీకరణ కొరకు నోడల్ అధికారులు, సహాయకులకు, ఎన్నికల అధికారులకు ఈ నెల 26, 27 తేదీలలో శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.పట్టభద్రుల ఎం.ఎల్.సి. ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు కొరకు ఎన్నికల నిర్వహించు ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, థియేటర్లలో స్లైడ్ షోలు ప్రదర్శించాలని తెలిపారు.ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కొరకు అధికారుల నియామకంపై ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ… జిల్లాలో బూత్ స్థాయి అధికారుల ద్వారా ఇంటింటా సర్వే ప్రక్రియ కొనసాగించడం జరుగుతుందని, మాసాంతం వరకు పూర్తి చేసే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా పోలింగ్ కేంద్రాల మార్పులు, నూతన పోలింగ్ కేంద్రాల గుర్తింపు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నివేదిక అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు రాములు,హరికృష్ణ, భూ సేకరణ ప్రత్యేక అధికారి డి.చంద్రకళ, ఎన్నికల తహశిల్దార్ ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.