ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 04 (ప్రజాబలం) ఖమ్మం ప్రతి సంవత్సరం బతుకమ్మ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ లోని 27వ డివిజన్ ప్రకాష్ నగర్ సెయింట్ జోసెఫ్ పాఠశాల, 22వ డివిజన్ చర్చ్ కాంపౌండ్ కమ్యూనిటీ హాల్, ఎన్ఎస్పీ క్యాంప్ లోని డిపిఆర్సీ భవన సమావేశ హాల్ నందు బుధవారం మహిళలకు మంత్రి పువ్వాడ చీరలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 4.27లక్షల చీరలను అన్ని మండల, గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పంపిణి చేస్తున్నారని, ఖమ్మం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని కులాల పండుగలకు తోఫాలతో పాటు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి రాష్ట్రం అభివృధ్ది, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తు ముందుకు సాగుతోందని తెలిపారు. 250 డిజైన్లతో రాష్ట్ర వ్యాప్తంగా 1.02 కోట్ల చీరలు రూ. 354 కోట్లతో చేనేత కార్మికులకు పని కల్పిస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో చీరల తయారీ చేసి పంపిణి చేస్తున్నారని అన్నారు. జరీతో పాటు వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారు చేయించారని 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు అందించారన్నారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ వేడుకలు ప్రతీకగా నిలిచాయని ఆయన అన్నారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు ఆడబిడ్డలందరూ కొత్త చీరలు ధరించాలనే ఉద్దేశంతో గడచిన 10 ఏళ్లుగా ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తున్నారని అవన్నీ నేనే స్వయంగా ప్రతి ఏడాది పంపిణి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభీ, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళీ, గజ్జెల లక్ష్మీ, సరస్వతి రవి నాయక్, పగడాల శ్రీవిద్య నాగరాజు, శీలంశెట్టి రమా వీరభద్రం, గోళ్ళ చంద్రకళ, దొడ్డా నగేష్, డిఆర్డీఓ విద్యాచందన, ఖమ్మం మునిసిపల్ డిప్యూటీ కమీషనర్ మల్లీశ్వరి, ఖమ్మం అర్బన్ తహశీల్దార్ స్వామి, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.