జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 21 : జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయని, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని ఆర్.బి.హెచ్.వి.,జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య,తహశిల్దార్ రఫతుల్లా లతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… 10వ తరగతి పరీక్షల నిర్వహణ కొరకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.త్రాగునీరు, విద్యుత్ సరఫరా,ఆర్.టి.సి. బస్సులు,ప్రశ్నా,జవాబు పత్రాల రవాణా, బందోబస్తు,పారిశుద్ధ్యం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.అత్యవసర వైద్య సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు,ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగిందని,పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కొరకు 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షల మొదటి రోజు 9 వేల 183 మంది హాజరు కావలసి ఉండగా 9 వేల163 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారని,ఒకసారి అనుత్తీర్ణులైన వారు 6 మంది హాజరు కావలసి ఉండగా ఇద్దరు హాజరయ్యారని,99.74 శాతం హాజరు నమోదు కావడం జరిగిందని తెలిపారు.విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు మొదటి రోజున జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష 2 గంటల ఆలస్యంగా ప్రారంభమైందని తెలిపారు.రోజు వారిగా,ప్రశ్నా పత్రాల సెట్ల వారిగా పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్నాపత్రాలను బందోబస్తు మధ్య ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రాలకు తరలించడం జరుగుతుందని,ఆఖరి నిమిషం వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునే ప్రశ్నాపత్రాల వివరాలు ఎవరికి తెలియదని తెలిపారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ నుండి స్టేషన్ పరిధిలోని పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు తరలించవలసి ఉంటుందని, ఈ క్రమంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం-03015 కు తరలించే ట్రంక్ బాక్సులో రెండవ రోజు పరీక్ష సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఉన్నాయని గమనించి,పరీక్షా కేంద్రానికి రావలసిన ప్రశ్నాపత్రాలు బాక్స్లను వెతకడంలో 1.30 గంటల సమయం పట్టిందని, ఉన్నతాధికారుల అనుమతి పొంది,పరీక్షా కేంద్రానికి తరలించి, విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను అందించడంలో మొత్తం 2 గంటల ఆలస్యం జరిగిందని,విద్యార్థులు పరీక్ష వ్రాసేందుకు ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిబంధనల ప్రకారం 3 గంటల సమయం ఇవ్వడం జరిగిందని,2 గంటల ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైనందున విద్యార్థులకు స్నాక్స్ అందించడం జరిగిందని తెలిపారు.ట్రంక్ బాక్స్ లో గుర్తించి రెండవ రోజు పరీక్ష ప్రశ్నాపత్రాలను తెరువలేదని, రాష్ట్ర ప్రభుత్వ సీల్తో పోలీస్ స్టేషన్లో అలాగే భద్రపర్చబడి ఉందని తెలిపారు.సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరొక ప్రశ్నాపత్రం ఇచ్చారని,పేపర్ లీక్ అయింది అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు.విధులలో నిర్లక్ష్యం,అలసత్వం వహించిన పరీక్షా కేంద్రం ముఖ్య పర్యవేక్షకులు మీర్ సప్టర్ అలీఖాన్,శాఖ అధికారి ఎన్.ఆర్.పద్మజ లను సస్పెండ్ చేయడం జరిగిందని,వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.