– సంజీవని మల్టీ స్పెషాలిటీ సూపర్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఊడుగుల సురేశ్
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 2
చిన్నా.. పెద్దా.. అనే తేడా లేకుండా.. ఇటీవల కాలంలో గుండెపోటు బారిన పడి చాలా మంది అకాలమృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి జమ్మికుంట సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు గోల్డ్ మెడలిస్ట్, జనరల్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ &క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. నిత్యం వ్యాయామం చేయడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. ఆల్కహాల్‌ను తీసుకోవడం, ధూమపానం ఆపేయడం మంచిదని చెప్పారు. రక్తంలో చక్కెరను, కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులోకి ఉంచుకోవాలని, హార్ట్ హెల్త్‌కు ఉపయోగపడేవి తినాలని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలకు డాక్టర్‌ను సంప్రదించాలని వెల్లడించారు.
ఛాతీమంటతో స్టెర్నమ్ వద్ద నొప్పి ..
ఇక ఛాతీమంట అనేది ఛాతీలో మంటతో కూడిన నొప్పి రావడమని, ఇది ఛాతీలో పక్కటెముకలు కలిసే పొడవాటి ఎముక (స్టెర్నమ్) వద్ద మొదలవుతుంటుందని వివరించారు. నొప్పి గొంతు వైపు వెళ్తుందని, కానీ భుజాలు, మెడ, చేతులకు పాకదని డాక్టర్ సురేశ్ పేర్కొన్నారు. ఈ పెయిన్ వచ్చినపుడు జీర్ణాశయంలోంచి ఆహారం నోట్లోకి వస్తున్న అనుభూతి కలుగుతుందని, పులి తేన్పులు రావడం, గొంతు చేదుగా అనిపించడం జరుగుతుందని వెల్లడించారు. పడుకున్నా, ముందుకు వంగినా నొప్పి ఎక్కువ కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని సూచించారు. ఎక్కువగా మసాలా పదార్థాలు తిన్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయని వైద్యుడు సురేశ్ పేర్కొన్నారు.
హార్ట్ ఎటాక్ లక్షణాలు…
గుండెపోటు, ఛాతీమంటకు మధ్య తేడాలను గుర్తించాలని నొక్కి చెప్పారు. గుండెపోటు అంటే ఛాతీ మధ్యలో నొప్పి వస్తుందని, ఛాతీ బిగపట్టినట్టు, లోపలేదో పిండేస్తున్నట్టు, పొడుస్తున్నట్టు అనిపిస్తుందని వైద్యుడు సురేశ్ తెలిపారు. నొప్పి స్వల్పంగా, వస్తూపోతూ ఉండొచ్చని, నొప్పి ఛాతీలోంచి భుజాలు, మెడ, చేతుల వైపు పాకుతుండటం పెయిన్ వచ్చినపుడు గమనించొచ్చని వెల్లడించారు. గుండె వేగంగా కొట్టుకోవటం, చల్లటి చెమట్లు పట్టడం, తల తేలిపోవడం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, అజీర్ణం, కొన్ని సార్లు వాంతి కూడా చేసుకోవడం, ప్రత్యేకించి ఈ లక్షాలన్నీ పనులు చేస్తుంటే తీవ్రమవడం జరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని స్పష్టం చేశారు.