రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య
పండితాపురం ఘటనలో గాయపడిన వారికి పరామర్శ
ఖమ్మం ప్రతినిధి జూలై 04 (ప్రజాబలం) ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులపై దాడి చేసిన బీఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి పండితాపురం గ్రామంలో జరిగిన దాడి ఘటనలో గాయపడి ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు హన్మంతరావు ప్రోద్భలంతోనే తమ పార్టీకి చెందిన మేకపోతుల మహేష్ గౌడ్, బాణోతు రామచంద్రు, బత్తుల నాగరాజుల సహా మరికొంతమంది పై బీఆర్ఎస్ పార్టీకి చెందిన గుండాలు కొంతమంది దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఓర్వలేకనే ఫ్యాక్షన్ రాజకీయాలకు బీఆర్ఎస్ తెరలేపిందని దుయ్యబట్టారు. నిందితుల పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కనకయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్టేషన్ ఎదుట తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.