కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన.
హార్వెస్టర్లతో సమావేశం నిర్వహించి పంట కోతలపై సలహాలు అందించాలి.
టోకెన్ పద్ధతి ప్రకారం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలి.
ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్.
రాజన్న సిరిసిల్ల( ప్రజాబలం) ప్రతినిధి:- యాసంగి సీజన్ నందు జిల్లాలో రైతులు పండించిన ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం రోజున సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్ ఖి మ్యా నాయక్ తో కలిసి ధాన్యం కొలుగోలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండల పరిధిలో తాసిల్దార్ ఆధ్వర్యంలో హార్వెస్టర్లతో సమావేశం నిర్వహించి పంట కోతల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలపై సలహాలు అందించాలని, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల టోకెన్ విధానంలో ప్రణాళిక ప్రకారం పంట కోతలు జరిగేలా చూడాలని అన్నారు. రైతులంతా ఒకేసారి ధాన్యం తీసుకొని వచ్చి ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ఎప్పుడూ ధాన్యం తీసుకొని రావాలో షెడ్యూల్ రూపొందించి రైతులకు సమాచారం అందించాలన్నారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ధాన్యం క్లీన్ చేయడం, ఆరబెట్టడం వంటి అంశాలను రైతులకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ప్యాడి క్లీనర్, వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు మొదలు వసతులు కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్ సరఫరా, లైట్లు మొదలుగు సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వేసవికాలం దృష్ట్యా తాగునీటి సరఫరా పై దృష్టి సారించాలని, చల్లని త్రాగునీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పెట్టుకోవాలని ఆయన అన్నారు. కొనుగోలు సమయంలో రైతులకు వడ దెబ్బ తగిలి అవకాశాలను నివారించాలని అన్నారు. వడ దెబ్బ తగిలితే వారికి ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలన్నారు.
వేయింగ్ యంత్రాలను తేమయంత్రాల పనితీరు చెక్ చేసి సర్టిఫై చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందజేయాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు గ్రామాల వారిగా సన్న రకం ధాన్యం ధ్రువీకరణ చేసి కొనుగోలు కేంద్రం మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్ని సంచులు, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు వీలుగా టార్పాలిన్ కవర్లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన హమాలీలు ఉండేలా చూడాలన్నారు.
ధాన్యం తరలింపుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం తరలింపుకు ఎక్కడైనా ట్రాక్టర్లను వినియోగిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని, లారీలలో మాత్రమే ధాన్యం తరలింపు జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదుల నమోదుకు జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక నెంబర్ కేటాయించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, పిల్ల పార్వ సరఫరాల సంస్థ మేనేజర్ రజిత, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, డి ఎం మార్కెటింగ్ ప్రకాష్, డి. సి. ఓ. రామకృష్ణ, వ్యవసాయ అధికారి రామారావు, తూనికలు కొలతల అధికారి రూపేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.