రుణమాఫీ పథకాన్ని జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేల పటిష్ట చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం ప్రతినిధి జూలై 18 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకాన్ని జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రైతు రుణ మాఫీపై బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని జిల్లాలో పటిష్ఠ అమలుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం ప్రతి రైతు కుటుంబానికి 2 రెండు లక్షల వరకు అసలు, వడ్డీ మాఫీ అవుతుందని అన్నారు. జిల్లాలో మొదటి విడతగా లక్ష లోపు పంట ఋణాలున్న 57,857 మంది రైతులకు రుణమాఫీ లబ్ది చేకూరుతుందన్నారు. రేషన్ కార్డు రైతు రుణమాఫీ పథకం అమలుకు తప్పనిసరి కాదని, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు ఒక ప్రామాణికంగా మాత్రమే రేషన్ కార్డును వినియోగిస్తున్నామని, భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పథకం అమలు అవుతుందని, ఈ అంశం పట్ల రైతులలో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 12, డిసెంబర్ 2018 నుంచి 9, డిసెంబర్ 2023 వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు, రెన్యువల్ చేసుకున్న రుణాలు అసలు, వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు ప్రతి రైతు కుటుంబానికి మాఫీ జరుగుతుందని, రైతు కుటుంబానికి రెండు లక్షల కంటే అధికంగా రుణం ఉన్నట్లయితే కుటుంబంలోని మహిళ పేరు పై రుణాలు నిబంధనల మేరకు ముందుగా మాఫీ అవుతాయని కలెక్టర్ తెలిపారు. రైతు రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం జమ చేసిన వెంటనే బ్యాంకులు లోన్ ఖాతా నుంచి సంబంధిత సొమ్మును రైతుల సేవింగ్స్ ఖాతాలోకి బదలాయింపు చేయాలని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ సహకార సంఘాల బ్యాంకులు, డీసిసిబీ పూల్ కు వచ్చే రుణ మాఫీ సొమ్ము సంబంధిత రైతులకు చేరేలా సహకార, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ తెలిపారు. రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కారానికి వ్యవసాయ విస్తరణ అధికారి, మండల వ్యవసాయ అధికారి వారిగా ఫిర్యాదుల పరిష్కార కేంద్రాల ఏర్పాటు పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమస్యలు ఏఇఓ, ఎంఏఓ ల స్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.రుణమాఫీకి సంబంధించి వచ్చే ప్రతి ఫిర్యాదు జాబితా రూపొందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. రుణమాఫీకి సంబంధించి జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా సజావుగా ప్రక్రియ జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా సహకార అధికారి ఖుర్షీద్, జిల్లా ఉద్యానవన అధికారి వెంకట రమణ, ఇంచార్జ్ ఎల్డిఎం శివకుమార్, బ్యాంకర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking