జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 09 : ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జూన్ మాసం మొదటి వారంలోగా పాఠశాలలకు కేటాయించిన మేరకు నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, విద్యాశాఖ సమన్వయకర్త చౌదరి లతో కలిసి మండల విద్యాధికారులు, ఎ.పి.ఎం.లు,జిల్లా సమాఖ్య, మెప్మా సభ్యులతో ఏకరూప దుస్తుల తయారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతుందని,ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు,వంటశాల, భోజనశాల,ప్రహారీగోడ ఇతర మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని,మే నెల 20వ తేదీ లోగా దుస్తులు సిద్ధం చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. విద్యార్థినీ,విద్యార్థులకు సంబంధించి దుస్తుల తయారీ కొరకు కొలతలు ఇప్పటికే తీసుకోవడం జరిగిందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ కొరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు.గత సంవత్సరం మాదిరిగా వచ్చే విద్యా సంవత్సరంలో సైతం విద్యార్థులకు ఏకరూప దుస్తులను తయారు చేసేందుకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని, కొన్ని ప్రాంతాలలో కుట్టు మిషన్లను కూడా అందించడం జరిగిందని,ఈ మేరకు సంఘాల సభ్యులు దుస్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఒక జత దుస్తులకు 75 రూపాయలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని మందమర్రి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద పెట్రోల్ బంక్ ఏర్పాటు కొరకు అవకాశం కల్పించడం జరిగిందని, ఏజెన్సీ ప్రాంతం అయినందున ఆసక్తి గల షెడ్యూల్డ్ తెగలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పనులు పూర్తి అయి ఎం.బి.రికార్డులు సమర్పించిన వాటికి బిల్లులు చెల్లించడం జరిగిందని,ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలలో పనులను త్వరగా పూర్తి చేసి రికార్డులు సమర్పించాలని తెలిపారు.అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు హైదరాబాద్లో అందించిన శిక్షణకు సంబంధించిన ధృవపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.