హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 19
జమ్మికుంట మండలంలోని గండ్రపల్లె కస్తూరిబా పాఠశాలలో జమ్మికుంట సిఐ వరగంటి రవి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ డ్రగ్స్ కు బానిసగా మారి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలన్నారు. డ్రీమ్ను చంపే మహమ్మారి డ్రగ్(డ్రగ్స్ ఎండ్ ఆల్ డ్రీమ్స్) అని వివరించారు. తమ తల్లిదండ్రుల కలలు నెరవేర్చడం కోసమే చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తమ పిల్లలు ఉన్నతస్థాయికి వెళ్లాలని విద్యార్థుల తల్లిదండ్రులు చెమటోడ్చి ఎండనక, వాననక కష్టపడే సంగతిని విద్యార్థులు అనుక్షణం గుర్తు ఉంచుకోవాలని చెప్పారు. చెడు అలవాట్లు తమ దరి చేరకుండా స్టూడెంట్స్ జాగ్రత్తపడాలన్నారు. సిగరెట్లు, మత్తు పదార్థాల వంటివి అలవాటు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తారని, వాటిని అసలు తమ వద్దకు రానీయకుండా ముందుజాగ్రత్తతో విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని వెల్లడించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడితే మైనర్ అయినా కఠినతరమైన శిక్షలుంటాయని, 5 ఏండ్ల వరకు జైలు శిక్షతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయాని వివరించారు.