మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేయాలి
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి
జూన్ 14:తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఒక్కో కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అత్యద్భుతంగా నిర్వహిస్తున్నామని అదే విధంగా ఈనెల 15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల్లో భాగంగా గురువారం నిర్వహించనున్న పల్లె ప్రగతి దినోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ జిల్లా పంచాయతి అధికారి రమణమూర్తి కి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ జరిగి పదేళ్ళవుతున్న ప్రస్తుత తరుణంలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. అనంతరం పల్లె ప్రగతి ద్వారా, జిల్లాలోని ఆయా గ్రామాలకు, తండాలకు వచ్చిన నిధుల వివరాలను, అందులో ప్రభుత్వం ద్వారా చేపట్టిన ఆయా సంక్షేమ పథకాలను తెలియజేయాలని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకల ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు జరిగిన లబ్ధిని, గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను సమావేశం నిర్వహించి ప్రకటించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు. రాష్ట్రం రాక ముందు నాటి పరిస్థితులను అద్దం పట్టేలా తెలియజేయాలని అదే సమయంలో ప్రస్తుతం పదేళ్ళ కాలంలో జరిగిన అభివృద్ధి, గ్రామ పారిశుద్ధ్యం, పచ్చదనం, పంచాయతీలకు ట్రాక్టర్లను అందించడం, పక్కా భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, క్రీడా ప్రాంగణాలు, హరితహారం ద్వారా మొక్కల పెంపకం, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు వంటి అనేక అభివృద్ధి జరిగిన వివరాలను ఫొటోలతో సహా చూపించాల్సిందిగా కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెల్లో ఎన్నో వసతులు సమకూరాయని పట్టణాల్లో ఉన్న వారు కూడా తిరిగి తమ సొంత గ్రామాలకు వస్తున్నారని ఈ విషయాలను సభలో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా రంగాల్లో జాతీయ స్థాయిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియచేయాలని ఈ విషయాలను నాడు -– నేడు అనే విధంగా రూపొందించి గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి, పంచాయతీరాజ్ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో ఊరూరా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఫ్లెక్సీలు పెట్టాలని ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారుచేసి పంచాలన్నారు. ఈ సమావేశంలో పల్లెప్రగతి విజయాలను, జాతీయ స్థాయిలో సాధించిన అవార్డులను పేర్కొనాలి. పారిశుద్ధ్యం మెరుగు పడటం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గిపోయిన తీరును ప్రముఖంగా ప్రస్తావించాల్సిందిగా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగిన తీరును ప్రస్తావించి ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం. చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారి,తో పాటు ఆయా మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ నిబంధలు, సూచనల ప్రకారం పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.