రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి
రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
రైతు దినోత్సవ సంబురాలతో పులకించిన పల్లెలు
స్వచ్చందంగా తరలివచ్చిన అన్నదాతలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 3:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని వారి కోసం ప్రభుత్వం తరపున ఎన్ని నిధులు వెచ్చించేందుకైనా వెనుకాడబోరని అన్నదాతకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తూ వారిని ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తున్న ప్రభుత్వం తమదని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లితో పాటు కీసర, శామీర్పేట అలియాబాద్ , మేడ్చల్ లో రైతువేదికల వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా రైతు వేదికల వద్ద ఏర్పాటు చేసిన అలంకరణతో పాటు రైతులు ప్రత్యేకంగా ఎడ్లబండ్లను ముస్తాబు చేసి రావడం ట్రాక్టర్లలో తరలిరావడం అలరించాయి. దీంతో పాటు బోనాలు, నృత్యాలు చేస్తూ రైతువేదికల వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, రైతు దినోత్సవం సందర్భంగా రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని వివరిస్తూ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రభుత్వం అందించిన సందేశాన్ని రైతులకు చదివి వినిపించారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న రైతులు వారి అనుభవాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి రైతుల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించి అనేక పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రైతుల కోసం ప్రవేశపెట్టారని రైతులను ధనవంతులు చేయడానికి కంకణం కట్టుకున్నారుఅని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు అరకొర కరెంట్తో అరగోస పడ్డారని తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత రైతులకు ఇరవై నాలుగు గంటల పాఉ ఉచిత కరెంట్ అందించడంతో పాటు వారికి భరోసానిస్తూ రైతుబంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. రైతులను సంఘటితం చేసేందుకు ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2,601 రైతువేదికల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందిస్తున్నామని తెలిపారు. పండిన పంట నిలవకు నూతన మార్కెట్ షెడ్లు, గోదాముల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రైతులు ఆయా గ్రామాల్లో ఏ సీజన్లో ఏఏ పంటలు వేసుకోవాలనే విషయాలను అప్పట్లో చెట్ల కింద కూర్చొని నిర్ణయించుకొనే వారని వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతువేదికలను నిర్మించి అందులో అన్ని సౌకర్యాలు కల్పించి సమావేశాలు ఏర్పాటు చేసుకొనేలా చేశారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా క్లస్టర్లుగా విభజించి అందుటులో వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించారని ఈ విషయాలన్నీ గమనిస్తే సీఎంకు రైతుల కోసం తీసుకొంటున్న సంక్షేమానికి నిదర్శనమని అన్నారు. అలాగే పంటలు వేసినప్పటి నుంచి కొనుగోళ్ళ వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చివరి గింజ వరకు ధాన్యం కొనుగోళ్ళు చేసి రైతుల ఖాతాల్లోకే డబ్బులు జమయ్యేలా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రైతువేడులను నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోందని ఇది ఎంతో సంతోషకరమైన విషయమని⁵ అన్నారు. రైతువేదికలను ఎంతో అందంగా ముస్తాబు చేశారని రైతులు సంప్రదాయబద్దంగా బోనాలు, డప్పుచప్పళ్ళు, ఎడ్లబండ్లను, ట్రాక్టర్లను అందంగా అలంకరించి వేడుకలకు రావడం రైతుల ఆనందాన్ని తెలియచేస్తోందన్నారు. 75 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కేవలం పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. జిల్లాలోని అర్హులందరికీ ఈ విడత రైతుబంధు వచ్చేలా కృషి చేస్తానని రెండోవిడత దళితబంధు కోసం గ్రామాలలో కమిటీ వేసి మేడ్చల్ నియోజకవర్గంలో 1,100 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని అందచేయడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ళను ఇవ్వటానికి కృషి చేస్తోందని దీనికి గాను 60 గజాల స్థలం మొదలుకొని 120 గజాలల స్థలాల్లో ఇల్లు కట్టుకొనే వారికి ప్రభుత్వం నుండి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షలు మంజూరు చేస్తుందని మంత్రి మల్లారెడ్డి ఈ విషయంలో ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వేల మందికి అనుమతులు వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి మూడుచింతలపల్లిని మండలంగా ఏర్పాటు చేసి స్వయంగా దత్తత తీసుకొన్నారని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు. లక్ష్మాపూర్, మూడు చింతపల్లి, కేశవరం, లింగాపూర్ తండా, మాడిశెట్టిపల్లిలో అనేక పనులు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఈ ఐదు గ్రామాల్లో జరిగిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే ప్రస్తుతం అన్ని కులాల వారికీ ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ … రైతు సంక్షేమం దిశగా పటిష్ట చర్యలు తీసుకొని, ప్రతి దశలో రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలోని 9 రైతు వేదికల్లో రైతు దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక రైతు వేదికల్లో పంటలపై వచ్చే అనుమానాలు నివృత్తి చేసే విధంగా ఏఈఓ లను, శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండే విధంగా చూస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించి రైతులు ఆదాయ పరంగా ఎదిగేందుకు ఎంతో తోడుపాటును అందిస్తుందని కలెక్టర్ అన్నారు.జిల్లాలో ఉద్యానవన పంటలు సాగు చేసుకునేందుకు మంచి వాతావరణం ఉందని , ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించబోతుందని, ఉద్యాన పంటల సాగుకు రైతులు ముందుకు వచ్చి ఆర్థికంగా బలపడాలని కలెక్టర్ కోరారు. జూన్ 2 నుండి 22 వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.
అంతకుముందు.తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా సాగు చేద్దాం.. వానాకాలం వరిని యాసంగి పంటలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకుందాం! కరపత్రికను విడుదల చేశారు
రైతు దినోత్సవం సందర్భంగా వేసవి దృష్ట్యా వైద్యారోగ్య శాఖచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు,
ఈ కార్యక్రమము లో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి , ఆర్డీవో రవి, జిల్లా వ్యవసాయాధికారిణి రేఖామేరీ డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ జిల్లా రైతుబందు అధ్యక్షులు నందారెడ్డి, భారీ సంఖ్యలో రైతులు, నాయకులు.అధికారులు, పాల్గొన్నారు.