ప్రతి స్కూల్లలో మెస్ కమిటీలను నిర్వహించాలి
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 2:
విద్యార్థులకు ఇంటి దగ్గరి కంటే రెసిడెన్షియల్ పాఠశాలలో నే రక్షణ ఎక్కువగా ఉంటుందనే నమ్మకం తగ్గకుండా ఉండేలా విద్యార్థులను చూసుకోవాలని రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్ ను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు.
సోమవారం మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్ లో రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహాణ పై నిర్వహించిన సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంటి దగ్గరికంటే రెసిడెన్షియల్ లోనే రక్షణ ఏక్కువగా ఉంటుందనే నమ్మకాన్ని కాపాడే బాధ్యత రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్ దేనని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో చిన్న చిన్న మరమ్మత్తులైన ఎలక్ట్రికల్ సమస్యలైన లైట్లు, ఫ్యాన్లు, త్రాగునీరు, శానిటేషన్, వాడుకునేందుకు వీలుగా టాయిలెట్లు, వాడుకునే నీరు, పైప్ లైన్ల మరమ్మత్తుల వంటి చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రిన్సిపల్స్ ను కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేటు భవనాలలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్వహిస్తున్న స్కూళ్లలో కనీస అవసరాలను తీర్చే విధంగా భవన యజమానులు మరమ్మత్తులను చేయించని పక్షంలో వారికి ఇచ్చే అద్దెలో మినహాయించి మరమ్మత్తులు చేయించాలని కలెక్టర్ ప్రిన్సిపల్స్ కు సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కూల్స్ ను నడిపిస్తున్నదని, చిన్న చిన్న సమస్యలతో ఆ ప్రతిష్టను తగ్గించకూడదని కలెక్టరు ప్రిన్సిపల్స్ ను హెచ్చరించారు. అదేవిధంగా మొరం పోయడం, కాంపౌండ్ వాల్, అదనపు తరగతి గదులు, టాయిలెట్లు,రూఫ్ లీకేజీ వంటి మేజర్ సమస్యలకు గాను ప్రణాళికలు తయారు చేసి రీజినల్ కో ఆర్డనేటర్ కు పంపాలని, రీజినల్ కో ఆర్డనేటర్ పరిశీలించి నివేదికలు తమకు పంపాలని కలెక్టర్ వివరించారు.
పిల్లలకు అందించే ఆహారం మెనూ ప్రకారం పరిశుభ్రంగా, రుచికరంగా ఉండేలా చూడాలని, సిద్దంగా ఉన్న ఆహారాన్ని ముందుగా మెస్ కమిటీ వాళ్లు తిన్న తరువాత పిల్లలకు పెట్టాలని, ప్రతి స్కూల్లలో మెస్ కమిటీలను నిర్వహించాలని కలెక్టరు తెలిపారు. అదే విధంగా స్టోరురూములో నాణ్యత గల వంట సామాగ్రిని తీసుకోవాలని, ఆ సామాగ్రిని జాగ్రత్తగా తడి లేకుండా నిలువ చేయాలని కలెక్టరు సూచించారు. విద్యార్థులకు జ్వరం గాని ఏదైనా అనారోగ్యం కలిగితే రెండురోజుల వరకు విడిగా ఉంచి వైద్యం చేయించాలని తగ్గని పక్షంలో దగ్గరగా ఉన్న పల్లెదవఖానా, పిహెచ్ సి సెంటర్లలో చూపించాలని తెలిపారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్టాఫ్ నర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, పల్లెదవఖానా, పిహెచ్ సి సెంటర్లలోని డాక్టర్ల ఫోన్ నెంబర్లు, అంబులెన్సు ఫోన్ నెంబరులు నర్సు దగ్గర ఉండేలా చూడాలన్నారు. అవసరమైన మందులను డిఎంహెచ్ఓ నుండి తీసుకోవాలని సూచించారు. బాలికల రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే గస్తీ కోసం అదనపు పోలీసులను కావాలని అడిగితే ఏర్పాటు చేస్తామని కలెక్టరు తెలిపారు.
రెసిడెన్షియల్ ప్రిన్సిపల్స్ పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తానని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో బిసి సంక్షేమశాఖ అధికారి కేషురాం, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి వినోద్ కుమార్, మైనారిటీ సంక్షేమ శాఖాధికారి కె.వీణ, ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.