ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 22 : ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక,విద్య,ఉపాధి, రాజకీయ,కుల గణన సర్వే ప్రక్రియలో ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, ముఖ్య ప్రణాళిక అధికారి మహ్మద్ ఖాసీం,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు లతో కలిసి ప్రత్యేక అధికారులు,మున్సిపల్ కమీషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి,అధికారులు,మండల పంచాయతీ అధికారులు,డాటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో ఎన్యుమరేషన్ బ్లాక్లను కేటాయించి ఎన్యుమరేటర్ల ద్వారా ఆయా బ్లాక్లలోని కుటుంబ సభ్యుల వివరాలు సేకరించడం జరిగిందని, ఇట్టి సమాచారాన్ని ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో పూర్తి స్థాయిలో నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఈ నేపథ్యంలో ఎన్యుమరేటర్లు అందించిన పూర్తి సమాచారాన్ని డాటా ఎంట్రీ ఆపరేటర్ల తమకు కేటాయించిన మేరకు ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రభుత్వ పోర్టల్లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. నిర్ధేశిత గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసే విధంగా వేగవంతం చేయాలని,జిల్లాలో 562 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం జరిగిందని, ఒక్కొక్కరికి 300 కుటుంబాల సమాచారం అందించడం జరుగుతుందని,ఒక రోజులో కనీసం 30 కుటుంబాలకు తగ్గకుండా సమాచారం పోర్టల్లో నమోదు చేయాలని తెలిపారు.డిసెంబర్ 1వ తేదీ లోగా వివరాలు నమోదు ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, వీలైతే బదిలీల పద్దతిలో ప్రక్రియ కొనసాగించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని తెలిపారు.ఆపరేటర్లు డాటా ఎంట్రీలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే పైఅధికారులను సంప్రదించి వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని,వివరాలు గోప్యంగా ఉంచాలని, నిర్లక్ష్యం,అలసత్వం వహించినా, నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలు నమోదు తీరును వివరించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.