హనుమాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

 

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ) ప్రతినిధి:- మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, పశువైద్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. హనుమాజీపేట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీ విధానం, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్యను పెంచాలని ఆయన ఆదేశించారు. అక్కడ నుండి నేరుగా లింగంపల్లి గ్రామంలో గల అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎంతమంది పిల్లలు అంగన్వాడికి వస్తున్నారు, అంగన్వాడి కేంద్రం పరిధిలో ఎంతమంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారో అని ఆరా తీశారు. పిల్లల బరువు, ఎత్తు వివరాలకు సంబంధించిన రిజిస్టర్ లను పరిశీలించి, అంగన్వాడి పిల్లలకు నాణ్యమైన, పౌష్టికాహారం అందజేయాలని ఆయన సూచించారు. అక్కడ నుండి నేరుగా హనుమాజీపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది, ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల వివరాలు ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్, ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక పశువైద్య కేంద్రాన్ని తనిఖీ చేసి, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ల వివరాలపై ఆరా తీసి, కృత్రిమ గర్వాధారణ నెలకు ఎన్ని అవుతున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. శాఖ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలలో వైద్యులు, సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking