ప్రజాఆరోగ్యం-ప్రమాణాలతో కూడిన విద్య ప్రభుత్వ బాధ్యత రాష్ట్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ,శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 21 :ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టమని రాష్ట్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐ.బి.చౌరస్తాలో 300 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ఐ.టి.,పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,టి.జి.ఎం.ఎస్.ఐ.డి.సి.ఎం.డి. హేమంత్ బొర్కడే, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్,మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,తెలంగాణ మినిమమ్ వేజెస్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎం.డి.సులేమాన్, గిరిజన సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక్ తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి మాట్లాడుతూ… ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామని, ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు మంచి ఆలోచన అని,పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు,ప్రమాణాలతో కూడిన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని తెలిపారు.వైద్య సేవల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా 90 శాతం వైద్యం ఇదే ప్రాంతంలో ఉచితంగా అందించి ప్రజలలో భద్రత,నమ్మకం కలిగిస్తామని తెలిపారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 6 పడకలను 30 పడకలకు అప్ గ్రేడ్ చేయడంతో పాటు మరిన్ని ఉప కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రంలో 7 వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందని, సుమారు 54 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. అత్యవసర సేవల సమయంలో వేగవంతమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్స్ సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, గిరిజన ప్రాంతాలలో 2, మండలానికి 1 చొప్పున అందించేందుకు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు.ప్రతి 30-35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర వ్యాప్తంగా 74 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రజలు ప్రాణాపాయానికి గురి కాకుండా బ్లాక్ స్పాట్ ప్రాంతాలలో అంబులెన్స్ను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లాలోని కిడ్నీ డయాలసిస్ కేంద్రంలో 10 పడకలను 30 పడకలకు పెంచడంతో పాటు డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లాలో అదనంగా 29 ఉప కేంద్రాల ఏర్పాటుతో పాటు మంచిర్యాల నియోజకవర్గంలోని వెంకట్రావుపేట, చెన్నూర్ నియోజకవర్గంలోని అంగ్రాస్ పల్లి లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,ఉత్తర తెలంగాణలో 4 క్యాన్సర్ కేంద్రాలు, వస్కులర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.వైద్య సిబ్బంది సంఖ్యను పెంచి ప్రజలకు వైద్య సేవలను సంపూర్ణంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మహిళలను విద్యావంతులను చేసి సమాజంలో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని,ప్రజలు రాష్ట్ర అభివృద్ధిలో జవాబుదారీగా ఉండాలని,సిద్ధాంత పరంగా సమాజ అభివృద్ధిలో భవిష్యత్తు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలని తెలిపారు.రాష్ట్ర ఐ.టి.,పరిశ్రమల శాఖ మంత్రి దుర్భిలా శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ప్రభుత్వం సంవత్సర కాలంలో అనేక రంగాలలో అభివృద్ధి సాధించిందని,ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా 7 నియోజకవర్గాలు, మహారాష్ట్ర,చత్తీస్ ఘడ్,ఇతర రాష్ట్రాల నుండి వైద్య సేవల నిమిత్తం వచ్చే ప్రజలకు అందుబాటులో అన్ని సేవలను అందించడం జరుగుతుందని, ప్రజలకు భారం కాకుండా ఉచితంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతని ఇస్తుందని,ప్రజలకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు వైద్యులు,సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అకుంఠిత దీక్షతో ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, మంచిర్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలు ముంపుకు గురికాకుండా 262 కోట్ల రూపాయల వ్యయంతో కరకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, 40 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అభివృద్ధి చేసి నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం క్రింద అంతర్గత రహదారులను నిర్మిస్తూ మండల, జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేయడం ద్వారా వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేస్తున్నామని తెలిపారు.జిల్లాలో పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు చిన్న,మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు.యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో మొదటిసారిగా మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా ప్రజలకు మందులను అందుబాటులో ఉంచేందుకు డ్రగ్ స్టోర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుకు ఆర్థిక క్రమశిక్షణతో చర్యలు చేపడుతున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని, వసతి గృహ విద్యార్థులకు కాస్మొటిక్,డైట్ చార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు.
2 లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా రైతులకు 3 విడతలలో రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ క్రింద అందించడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని, సింగరేణి సంస్థలో పని చేస్తున్న కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు బోనస్ అందించామని,800 మెగావాట్ల సామర్థ్యంతో 3 పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని,ఆర్థిక వ్యవస్థను సరిచేసి ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు.మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ…జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపు 15 లక్షల మందికి ఉపయోగపడుతుందని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని వారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.ఆసుపత్రి ఏర్పాటు కొరకు ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, 225 పడకలతో మాత శిశు,425 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి కలిపి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం కొరకు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఇక్కడే పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా జిల్లాతో పాటు పక్క రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్(రెవిన్యూ), మోతిలాల్ మంచిర్యాల, మంచిర్యాల ఆర్డిఓ శ్రీనివాస్,మంచిర్యాల డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ బి హరీష్ రాజ్,మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం డి సులేమాన్,మంచిర్యాల మెడికల్ ఎమ్ ఎస్ ఈ ఎన్ టి సూపరిండేంట్ హరిష్ చంద్ర రెడ్డి,రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు నస్పూర్ మున్సిపల్ ఛైర్మన్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ ముని,లక్షెటిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్,33 వ వార్డ్ కౌన్సిలర్ జగ్గరి సుమతి-సంజీవ్,నస్పుర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రజిత, మంచిర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బదరి సుధాకర్, లక్షెటిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ ఆరిఫ్,మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు
పూదరి తిరుపతి, లక్షెటిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు, దండేపల్లి మండల అధ్యక్షుడు
అక్కల వెంకటేశ్వర్లు, లక్షెటిపేట మండల అధ్యక్షుడు పింగిళి రమేష్,హాజిపూర్ మండల అధ్యక్షుడు తోట రవి కౌన్సిలర్లు ఎంపీటీసీలు,సర్పంచులు,వార్డ్ నెంబర్స్, సంబంధిత శాఖల అధికారులు,పోలీస్ లు అధికారులు,ప్రజా ప్రతినిధులు,అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.