ప్రజబలం ప్రతినిది : ఆగస్టు14: హైదరాబాద్
పింగళి వెంకయ్య
(ఆగష్టు 2, 1876 – జూలై 4, 1963)
తెలుగువారి ఆత్మగౌరవం..
ఆగష్టు 15 వచ్చిందంటే చాలు దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ప్రతీ భారతీయుడు ఆ త్రివర్ణపతాకానికి సెల్యూట్ చేస్తూ తమ దేశభక్తిని చాటుకుంటూ ఉంటారు. దేశం మనదే, జాతీ మనదే, ఎగురుతున్న జెండా మనదే అంటూ ప్రతి భారతీయుడు గర్వంగా పాట పాడుకుంటూ ఉంటారు.
అంతటి గొప్ప మువ్వన్నెల జెండాను రూపొందించింది తెలుగువాడే కావడం విశేషం. కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు. ఆగష్టు పదిహేను మువ్వన్నెల జెండాను ఎగురవేస్తూ యావత్ భారతావని త్రివర్ణపతాక సృష్టికర్త అయిన పింగళి వెంకయ్యకు నిరాజనం పలుకుతోంది. స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త, పింగళి వెంకయ్య 1916లో “భారత దేశానికి ఒక జాతీయ పతాకం” అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.
” ఈ పతాకం సామాన్యమైనది కాదు. సామ్రాజ్యవాద సూచకం కాదు. ఏ దేశాన్నీ ఆక్రమించే విధానాన్ని సూచించే కేతనం అసలే కాదు. ఇది మన స్వాతంత్ర్య చిహ్నం. ” భారత రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రవేశపెడుతూ జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలివి.
ఒక జాతి స్వాతంత్ర్యం, సౌభాగ్యం, సంపద పతాకంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. మన దేశంలో మొదటిసారిగ జాతీయ పతాకం కలకత్తాలోని గ్రీన్‌పార్కులో 1906 ఆగస్టు 7వ తేదీన ఎగురవేశారు.
1907లోనే ప్యారిస్ నగరంలో మేడం కామా జాతీయ పతాకం రూపొందించి ఎగురవేశారు. 1917లో హోమ్‌రూల్ ఉద్యమంలో ఈ పతాకమే రెపరెపలాడింది.
1907లోనే ఒక మేధావి జాతీయ పతాకాన్ని రూపొందించుటకు యత్నించాడు. 1916లో ‘ భారత దేశానికి ఒక జాతీయ పతాకం ‘ అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు. ఆ నిష్కళంక దేశభక్తుడే పింగళి వెంకయ్య. ఆయన రూపొందించిందే నేటి మన జాతీయ పతాకం.
వెంకయ్య, కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో 1878 ఆగష్టు 2వ తేదీన జన్మించారు. తండ్రి హనుమంతరాయుడు దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణం. మాతామహులైన అడివి వెంకటాచలం చల్లపల్లి సంస్థానం ఠాణేదారు. ఆయనకు పెదకళ్ళేపల్లి బదిలీ కావటం వల్ల వెంకయ్య ప్రాథమిక విద్య అక్కడే పూర్తి అయింది. బందరులో హైస్కూలు చదువు పూర్తి చేశారు.
చొరవ, సాహసం మూర్తీభవించిన వెంకయ్య బొంబాయి వెళ్ళి, 19వ ఏట సైన్యంలో జేరి దక్షిణాఫ్రికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. స్వదేశం వస్తూ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్ లు చూచివచ్చారు.
మద్రాసులో ప్లేగ్ ఇన్‌స్పెక్టరు శిక్షణ పూర్తి చేసి, కొంతకాలం బళ్ళారిలో ప్లేగ్ ఇన్‌స్పెక్టర్ గా పని చేశారు. ఆయన జ్ఞాన దాహం అంతులేనిది. శ్రీలంక వెళ్ళి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనమిక్స్ ప్రత్యేక విషయంగా చదివి కేంబ్రిడ్జి సీనియర్ పరీక్షలో నెగ్గారు. కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఏ.వి. కాలేజీలో చేరి, సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడే వెంకయ్య ని ‘ జపాన్ వెంకయ్య ‘ అనేవారు.
రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య కు వ్యవసాయంపట్ల ఎంతో అభిరుచి వుండేది. ఆయన కాంగ్రెస్ సభలకు తరచుగా వెళ్ళేవారు. 1908లో దాదాభాయి నౌరోజి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సభలకు వెళ్ళారు.
ఆ సభల్లోనే ముక్త్యాల రాజా నాయని రంగారావు బహద్దూర్ పరిచయం కల్గింది. వ్యవసాయ రంగంలో అప్పటికే పరిశోధనలు సాగించిన వెంకయ్య తో పరిశోధనశాల నెలకొల్పారు. అమెరికా నుండి కంబోడియా ప్రత్తి విత్తనాలు తెప్పించి ప్రత్తిని పండించిన ఘనత వెంకయ్య కే చెల్లు. 1907 నుండి 1910 వరకు మునగాలలో ఉంటూ ‘వ్యవసాయ శాస్త్రం’ అనే గ్రంథాన్ని వ్రాశారు. అప్పుడాయనను ‘ప్రత్తి వెంకయ్య’ అనేవారు. వెంకయ్య, బ్రిటన్ లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ సభ్యత్వం లభించింది.
వెంకయ్య బందరులోని జాతీయ కళాశాలలో 1911 నుండి 1919 వరకు అధ్యాపకులుగా పని చేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. ఈనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ఎన్.సి.సి.’ శిక్షణోద్యమానికి 75 ఏళ్ళ క్రితమే శ్రీకారం చుట్టిన మహనీయుడు పింగళి వెంకయ్య. అప్పట్లోనే చైనా జాతీయ నాయకుడైన ‘ సన్‌యెట్ సేన్ ‘ జీవిత చరిత్ర వ్రాశారు.
భారతదేశ కార్యాలయాలపై బ్రిటీష్ ప్రభుత్వ జెండాలు ఎగురవేయడంపై కలత చెందిన పింగళి వెంకయ్య భారతదేశానికి ఒక జాతీయ జెండా ఉండాలని ఆశించారు. భారతదేశం కార్యాలయాలపై బ్రిటీష్ జెండాలు ఎగురుతుండటంపై ఆయన మనోవేదన చెందారు. భారతీయుకులు ఒక జాతీయ జెండా ఉండాలని పరితపించారు.
1921లో విజయవాడలో (బెజవాడ) అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. అప్పటికే జాతీయ జెండాను రూపొందించాలనే దృఢ సంకల్పంతో ఉన్న పింగళి వెంకయ్య గాంధీజీ ఆదేశాలతో జెండా రూపకల్పన చేశారు. అదే నేటి భారతదేశపు జాతీయ జెండా కావడం విశేషం. 1921లోనే కాంగ్రెస్ సంస్థ ఆ పతాకాన్ని కాంగ్రెస్ పతాకగా ఆమోదించింది.
స్వాతంత్ర్య ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని చూపించారు. దేశంలో రెండు ప్రధాన మతస్తులైన హిందువులు, ముస్లింలకు గుర్తుగా ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. అందులో చరకాను చేర్చాల్సిందిగా లాలా హన్స్ రాజ్ సోంధీ సూచించారు.
మరోవైపు ఎరుపు, ఆకుపచ్చ రంగులకు తోడు మిగిలిన మతాల వారికి గుర్తుగా తెలుపు రంగును చేర్చాలని మహాత్మగాంధీజీ పింగళి వెంకయ్యకు సూచించారు. 1931లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జెండాకు ఆమోద యోగ్యం తెలిపింది. అనంతరం పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
22.7.1947న భారత రాజ్యాంగసభ ఈ పతాకాన్ని ఆమోదించింది. నెహ్రూ సలహామేరకు త్రివర్ణ పతాకంలో రాట్నానికి బదులుగా ‘అశోక చక్రం’ ఉంచబడింది.
క్రమంగా వెంకయ్య రాజకీయాల నుండి దూరమయ్యారు. మద్రాసు వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి ‘ డిప్లొమా’ తీసుకొన్నారు. తర్వాత నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా (అభ్రకం) గురించి పరిశోధన చేశారు. వజ్రకరూరు (అనంతపురం జిల్లా) హంపీ మున్నగు చోట్ల ఖనిజాలను అన్వేషిస్తూ ప్రభుత్వానికి ఖనిజాల ఉనికిని గురించిన నివేదికలు పంపారు.
అంతవరకు బొగ్గు వజ్రంగా మారుతుందని అనుకునేవారు. ప్రపంచంలో మొదటిసారిగ వజ్రపుతల్లి రాయిని కనుగొన్న పరిశోధకులు వెంకయ్య . ఈ తల్లిరాయిని గురించి వెంకయ్యగారు ఆంగ్లంలో గ్రంథం వ్రాశారు. పాశ్చాత్య శాస్త్రజ్ఞఉలు వెంకయ్య ప్రతిభా విశేషాలను ఎంతగానో కొనియాడారు. ప్రజలు వెంకయ్య ని ‘వజ్రాల వెంకయ్య’ అన్నారు.
దేశభక్తి భావనా సంపన్నులైన వెంకయ్య, దక్షిణాఫ్రికా నుండి వచ్చిన తర్వాత ఉత్తరభారతదేశంలోని రహస్య విప్లవ సంఘాల్లో అయిదేళ్ళకుపైగా పని చేశారు. భారతదేశాన్ని పారిశ్రామికంగా జపాన్ తో దీటుగా పెంపొందించాలని ఆశించారు.
వెంకయ్య ఆరడుగుల ఎత్తుండేవారు. నల్లని రంగులో ఉక్కు మనిషిలా ఉండేవారు. కంచులాంటి కంఠస్వరం, నిష్కళంక దేశభక్తుడు. అవినీతిని, అన్యాయాన్ని ఏ మాత్రం సహించేవారు కాదు.
పింగళి వారు మహారాష్ట్ర ప్రాంతం నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చినవారు. పింగళి మోరు పంతు వంశీయులు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పింగళివారి ఇంటి ఆడపడుచు. నైజాం నవాబు వద్ద మహాసేనానిగా పనిచేసిన పింగళి మాదన్న వంశీయుడే వెంకయ్య.
ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనాన్ని నిర్మించిన వాడాయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్య ని గుర్తించకపోవటం శోచకీయం. జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో, మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, వెంకయ్య పేరును సూచించకపోవడం విచారకరం.
తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు. జీవితాంతం దేశం కొరకు స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ‘ తివేణి ‘ సంపాదకులు డా. భావరాజు నరంసింహారావు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా. టి.వి.ఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, డా. గూడూరు నమశ్శివాయ మున్నగు పెద్దలు 15.1.1963న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తర్వాత ఆరు నెలలకే 4.7.1963వ తేదీన వెంకయ్య దివంగతులయ్యారు,
కన్నుమూసేముందు వారి చివరి కోరికను వెల్లడిస్తూ “నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ వున్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక” అన్నారు.
భారత జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య స్మృత్యర్థం విజయవాడలో ఆదివారం 2008 ఫిబ్రవరి 3 న తిరంగా (త్రివర్ణ) పరుగు నిర్వహించారు.సుమారు లక్ష మంది ఈ పరుగులో స్వచ్ఛందంగా పాల్గొన్నారు
వెంకయ్య కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకొడుకు పరశురాం జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో పనిచేశాడు. రెండవ కుమారుడు చలపతిరావు సైన్యంలో పనిచేస్తూ చిన్నవయసులోనే మరణించాడు. కూతురు సీతామహలక్ష్మి మాచర్లలో నివసిస్తున్నది.
జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య.నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన వారే వెంకయ్య ..
సీనియర్ జర్నలిస్టు వెంకటాయోగి రఘురాం(ప్రజబలం).