-మీడియా అకాడమి ఛైర్మన్ వ్వవహారంపై అభ్యంతరం
-ఇళ్ళస్థలాలకు దరఖాస్తుల పేరుతో జర్నలిస్టులను మభ్య పెట్టొద్దు
-టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా ఒక జర్నలిస్టు యూనియన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులను మభ్యపెట్టి పక్కదారి పట్టించేందుకు ఆ యూనియన్ చేస్తున్న చర్యలను ఫెడరేషన్ నాయకులు వ్యతిరేకించారు. యూనియన్ చేస్తున్న అనధికారిక కార్యకలాపాలకు మీడియా అకాడమి ఛైర్మన్ మద్దతు ఇవ్వడాన్ని వారు తప్పుపట్టారు. శుక్రవారం సూరారం లోని అంబేద్కర్ భవన్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, కార్యదర్శులు ఎస్ కె సలీమా, తన్నీరు శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ,గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల స్థలాల దరఖాస్తుల పేరుతో జర్నలిస్టులను అయోమానికి గురి చేస్తున్నారని, యూనియన్ పేరుతో దరఖాస్తులు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన, చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే సమాచార శాఖ ద్వార ప్రక్రియ చేపట్టాలని, లేదంటే అధికారులు,జర్నలిస్టు యూనియన్ల ప్రతినిధులు,
సీనియర్ పాత్రికేయులతో కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా అకాడమి చేయాల్సిన బాధ్యతలను పక్కన పెట్టి అన్ని పనులు తానే చేస్తామనడం, అందుకు ముఖ్యమంత్రి, మంత్రులు జర్నలిస్టులకు సంబంధించిన అన్ని విషయాలు ఛైర్మన్ కు అప్పగించడం సరైంది కాదని అన్నారు. జర్నలిస్టుల సమస్యల విషయంలో గానీ,మీడియా అకాడమీ నిర్వహణలో గానీ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులే ఈ ప్రభుత్వంలో జరగకూడదని, అలా జరిగితే జర్నలిస్టుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని మామిడి సోమయ్య హెచ్చరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు,హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీలను పరిగణలోకి తీసుకోవాలని,సొసైటీలలో లేని అర్హులైన జర్నలిస్టుల జాబితాను ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల విషయంలో ఒక యూనియన్ చేస్తున్న హడావిడి,తప్పుడు ప్రచారాలతో జర్నలిస్టులు ఆందోళ చెందవద్దని ఆయన కోరారు. గత తొమ్మిదిన్నరేండ్లు టీఆర్ఎస్,
బీఆర్ ఎస్ చేసిన మోసాన్ని చవి చూసిన జర్నలిస్టులు ఇక ఎవరు మోసం చేసినా భరించే పరిస్థితిలో లేరని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనె జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని మామిడి సోమయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షుడు గడ్డమీది అశోక్, కార్యదర్శి పి.శంకర్, సీనియర్ జర్నలిస్టులు జగదీశ్వర్, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.