ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ విజయవంతం చేయాలి

 

ఏఐటీయూసీ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి వి. ఎస్.బోస్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 12:
దేశం కోసం శ్రమిస్తున్న కార్మిక, రైతుల జీవితాలు మరియు జీవనోపాధిపై నిరంతరాయంగా అనాగరిక దాడులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తుందని ఏఐటీయూసీ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ఎస్. బోస్ ఆరోపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా నిర్వహించే పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ ను విజయవంతం చేయాలనీ కోరుతూ నాచారం చౌరస్తా వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ కార్పొరేట్- మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ఎస్. బోస్* మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిపాలనా అధికారాలను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తోందని, ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తుందని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడి తెచ్చుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం నిరంకుశంగా రద్దు చేసి, కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజించి కార్మికులను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చివేసిందనీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నల్ల కోడ్లతో దేశంలోని కార్మికులంతా హక్కులు, సామాజిక భద్రతను కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రధాని మోడీ రైతులకు ఇచ్చిన ఏఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేసాడని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ కళ్ళు తెరిపించేందుకు కార్మికులు, రైతులు కలసి ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహిస్తున్నామని, సామాన్య ప్రజలు, విద్యార్ధి, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, రైతులు పెద్దఎత్తున పాల్గొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక/గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు* మాట్లాడుతూ సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కూడా మోడీ ని సాగనంపాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా పూర్వ అధ్యక్షుడు ఎస్. శంకర్ రావు, బుచ్చి రెడ్డి,నేతలు నర్సింహా, కృపాకర్, మిరియాల సాయిలు, నర్సింగ్ రావు., ఐ ఎన్ టీ యూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, టీఎన్ టీ యూసీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, నేతలు గణేష్, కృష్ణ రెడ్డి,చంద్ర శేఖర్, సౌండర్ రాజు, అబ్దుల్లా, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking